విండీస్ ను ముంచిన డైసన్
జార్జిటౌన్: డక్ వర్త్-లూయీస్ నిబంధన, కోచ్ జాన్ డైసన్ తప్పుడు లెక్క వెస్టిండీస్ జట్టును ఓటమిపాలు చేశాయి. ఇక్కడి గయానా నేషనల్ స్టేడియంలో రెండు జట్ల మధ్య ప్రారంభమైన వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టును పాల్ కాలింగ్ వుడ్, ఒవైసీ షా అర్ధ సెంచరీలతో ఆదుకున్నాక, వెస్టిండీస్ కు 50 ఓవర్లలో 271 పగుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. విండీస్ ఇన్నింగ్స్ లో 45 ఓవర్లు పూర్తయ్యాక, వెలుతురు తగ్గిపోతున్న సమయంలో, ఆట ఆసక్తి కరమైన మలుపు తిరిగింది. అప్పటికి దినేష్ రామ్ దిన్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బంత్క్ ఎల్.బి.డబ్ల్యు అయ్యాడు. వెస్టిండీస్ స్కోరు 46.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు. డక్ వర్త్-లూయీస్ నిబంధన ప్రకారం ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ కూడా ధీమాగా ఉన్నాడు. కాని...
వెస్టిండీస్ కోచ్ జాన్ డైసన్ లెక్క తప్పయింది. లక్ష్యానికి ఇంకా రెండు పరుగులు తక్కువ ఉండగానే, తాము గెలిచామనుకుని, బ్యాట్స్ మెన్ ను వెనక్కు వచ్చేయమన్నాడు. తరువాత విషయం తెలుసుకుని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ దగ్గరకు పరుగెత్తాడు. అప్పటికే పొరపాటు జరిగిపోయింది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇంగ్లండ్ కు 1-0 ఆధిక్యత లభించింది. ఎంతో కష్టపడి విండీస్ జట్టును గెలుపు అంచుల్లోకి తీసుకువెళ్లిన లెండిల్ సిమ్మన్స్(62), రామ్ నరేష్ శర్వాన్(57), శివ్ నరైన్ చందర్ పాల్(46), కీరన్ పోలర్డ్(42)ల శ్రమ వృధా అయిపోయింది.
జాన్ డైసన్ ఇంగ్లండ్ జట్టు కోచ్ పదవి కోసం ఇంతకుముందే ప్రయత్నాలు ప్రారంభించాడట!
News Posted: 21 March, 2009
|