ఐపిఎల్ కు లండన్ పోలీస్ నో
లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సమకూర్చడానికి తమకు తగిన సమయం లేదని భావిస్తున్నట్టు ఇక్కడి సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ట్వంటీ టోర్నమెంట్ ఇంగ్లండ్ లో జరిగే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. భారతదేశంలో లోక్ సభ ఎన్నికల కారణంగా తేదీలు కుదరకపోవడంతో పోయీలను విదేశాలకు తరలించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(విసిసిఐ) నిర్ణయించడంతో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ప్రధాన వేదికలుగా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వున్న ఐప్ఎల్ కమిషనర్ లలిత్ మోడీ అక్కడ చర్చలు పూర్తయ్యాక లండన్ వస్తారు. అయితే ఇంగ్లండ్ లో వాతావరణం ప్రధాన సమస్యగా పరిణమించే అవకాసం ఉండడగా, ఇప్పుడు పోలీసులు భద్రత సమకూర్చలేమని చెప్పడం నిర్వాహకులకు పెద్ద షాక్ ఇస్తుందని చెప్పవచ్చు. ఐపిఎల్ టోర్నమెంట్ నిర్వహణకు సంసిద్ధతను తెలియజేసే ముందు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) అధికారులు తమను సంప్రదించలేదని లండన్ పోలీసు అధికారులు చెప్పారు.
'టోర్నమెంట్ నిర్వహిస్తే ఎంత సొమ్ము మిగులుతుందని ఆలోచించే ముందు ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత మీద వారు(ఇసిబి)దృష్టి కేంద్రీకరించ లేదు' అని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించినట్టు ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇక్కడ భద్రత గురించి ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడాలంటే అంతకు ముందు చేయవలసింది చాలా ఉందని ఆయన చెప్పారు. ఐపిఎల్ పోటీలు ఏప్రిల్ 10న ప్రారంభం కావలసి వుంది. దానికి వారం రోజుల ముందు గ్రూప్-2- శిఖరాగ్ర సభలు ఇక్కడ జరుగుతాయి. ఆ సందర్భంగా హింసాకాండ, ఘర్షణలు జరగవచ్చన్న భయంతో పోలీసు సిబ్బంది అందరికీ సెలవులు రద్దు చేశారు. అంతేకాకుండా, ఎఱ్.ఎ కప్ ఫుట్ బాల్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ లు, లండన్ మారథాన్ కూడా ఐపిఎల్ తేదీలలోనే జరుగనున్నాయి. ఇవన్నీ కాదని ఇంగ్లండ్ లోనే ఐపిఎల్ టోర్నమెంట్ జరిగితే కేవలం భద్రతా ఏర్పాట్ల కోసం ఐపిఎల్ నిర్వాహకులు దాదాపు 50 లక్షల పౌండ్ల బిల్లు చెల్లించుకోవలసి ఉంటుంది.
News Posted: 24 March, 2009
|