గంగూలీకి బుకానన్ కిక్!
కోల్ కటా: కోల్ కటా నైట్ రైడర్స్(కెకెఆర్) జట్టు మేనేజర్ జాన్ బుకానన్ బుధవారం బాంబు పేల్చారు. షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని ఈ జట్టుకు ఐపిఎల్ రెండో సీజన్ లో సౌరవ్ గంగూలీ కెప్టెన్ కాదని మీడియా సమావేశంలో బుకానన్ ప్రకటించాడు. ఈ విషయమై తామిద్దరం చర్చించామని, జట్టుకు శాశ్వతంగా ఓ కెప్టెన్ అంటూ ఉండడని చెప్పాడు. పక్కనే ఉన్న సౌరవ్ కు ఈ మాట అశనిపాతమయింది. అయినా తానేమీ కలవరపడడం లేదని, పరుగులు సాధించడం, వికెట్లు పడగొట్టడమే తన లక్ష్యమని అన్నాడు. సొంత పద్ధతులను, వ్యూహాలను అమలు పరచే హక్కు బుకానన్ కు ఉందన్నాడు. కెప్టెన్ విధులు, బాధ్యతలను వికేంద్రీకరించాలని కెకెఆర్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది.
బుకానన్ రచించిన కొత్త వ్యూహం ప్రకారం జట్టుకు బ్యాటింగుకు, ఫీల్డింగుకు వేర్వేరు కెప్టెన్లు ఉంటారు. మ్యాచ్ లో జట్టు బ్యాటింగు ఆర్డర్ ను ఆ కెప్టెన్ నిర్ణయిస్తే, మిగతా ఫీల్డ్ వ్యవహారాలన్నింటి పైన ఫీల్డింగ్ కెప్టెన్ జట్టు అజమాయిషీ చేస్తాడు. అక్కడితో అయిపోలేదు. బ్యాటింగ్ కెప్టెన్ బాధ్యతలను మాథ్యూ మాట్ లేదా జాన్ బుకానన్ నిర్వర్తిద్దామనుకుంటున్నారట! అదే జట్టులోని మిగతా ఆటగాళ్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వంతున ఫీల్డింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రెండన్ మెకల్లమ్, బ్రాడ్ హాడ్జ్(ఆస్ట్రేలియా), క్రిస్ గేల్(వెస్టిండీస్)లకు కెప్టెన్సీలో తర్ఫీదు ఇస్తారు. కెకెఆర్ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరక్టర్ అయిన జాన్ బుకానన్ తొలుత గంగూలీని రాబోయే సీజన్ లో జట్టు నుంచే తొలగించాలనుకున్నాడు. గంగూలీ ఫిట్ నెస్ అతడికి సంతృప్తికరంగా లేదట!
News Posted: 25 March, 2009
|