హాల్ ఆఫ్ ఫేమ్ లో హాడ్లీ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ లెజెండరీ ఆల్ రౌండర్ రిచర్డ్ హాడ్లీకి అంతర్జీతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి)హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం లభించింది. భారత-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ ప్రారంభమైన మూడో క్రికెట్ టెస్ట్ మొదటిరోజు(శుక్రవారం) లంచి విరామ సమయంలో ఈ మేరకు ప్రకటన చేశారు. క్రికెట్ కు ఎనలేని సేవచేసి, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మాజీ లెజెండ్ లకు ఈ అపురూప గౌరవం లభిస్తుంది. ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం పొందిన 55వ క్రికెటర్, ఏకైక న్యూజిలాండర్ రిచర్డ్ హాడ్లీ. ఈ సందర్భంగా క్లుప్తంగా జరిగిన ఫంక్షన్ లో ఐసిసి అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ స్మారక క్యాప్ ను హాడ్లీకి బహూకరించారు. హాడ్లీ అందుకు కృతజ్ఞతలు చెబుతూ,'ఈ సమయంలో నా తండ్రి (వాల్టర్ హాడ్లీ)ఉంటే ఎంతో సంతోషించేవారు. ఈ గుర్తింపు నాకు లభించినందుకు నా అంతగా గర్వపడి ఉండేవారు. ఎప్పుడూ పోరాట దృక్పథంతో, విజయమే లక్ష్యంగా కష్టపడి ఆడమనీ, అదే సమయంలో ఆట విలువలను, క్రీడాస్ఫూర్తిని కాపాడమనీ నాకు సలహా ఇచ్చేవారు' అన్నాడు. హాడ్లీ తన క్రికెట్ కెరీర్(1973-90)లో 86 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 3124 పరుగులు చేసి, 431 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో 400 వికెట్ల మైలురాయిని తొలుత అధిగమించిన ఆటగాడు హాడ్లీయే.
News Posted: 3 April, 2009
|