కుప్పకూలిన కివీస్
వెల్లింగ్టన్: కివీస్ జట్టు భయపడినట్టే జరిగింది. సీమర్ లకు అనుకూలమైన పిచ్ తయారుచేస్తే భారత బౌలర్లను ఎదుర్కోవడం అసాధ్యమని భావించిందే నిజమయింది. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ జహీర్ ఖాన్(5/65)ఊపిరి సలపకుండా వేసిన బంతులతో ఉక్కిరిబిక్కిరైన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్, రెండో రోజు(శనివారం) టీ విరామ సమయం తరువాత, మొదటి ఇన్నింగ్సులో 197 పరుగులకే కుప్పకూలిపోయారు. దీంతో 182 పరుగుల మొదటి ఇన్నింగ్స్ స్కోరు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసే లోగా సెహ్వాగ్(17) వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసింది. గంభీర్ 28, ద్రవిడ్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో మెకింటోష్(32), టేలర్(42), మెకల్లమ్(24) మినహా మిగిలిన వారందరూ 20 పరగులు కూడా చేయకుండానే ఔటయిపోయారు. ఇషాంత్ శర్మ 47 పరుగులకు 1, మునాఫ్ పటేల్ 20 పరుగులకు 1, హర్భజన్ సింగ్ 43 పరుగులకు 3 వికెట్లు పడగొట్టారు. వికెట్ కీపర్ ధోని ఆరు క్యాచ్ లు పట్టుకోవడం విశేషం. అంతకు ముందు 9 వికెట్ల నష్టానికి 375 పరుగుల స్కోరుతో మొదటి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారతజట్టు, ఆట ప్రారంభమైన మూడో ఓవర్లోనే మరో నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది. ఇషాంత్ శర్మ 18 పరుగులకు ఔట్ కాగా, మునాఫ్ పటేల్ 15 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.
News Posted: 4 April, 2009
|