ట్వంటీ జట్టు ప్రాబబుల్స్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ లో వచ్చే జూన్ నెలలో జరిగే వరల్డ్ ట్వంటీ20 చాంపియన్ షిప్ లో పాల్గొనే భారతజట్టు కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్ లో క్రింతసారి ఆడిన పేస్ బౌలర్లు జోగీందర్ శర్మ, ఎస్.శ్రీశాంత్ లకు స్థానం లభించలేదు. మొట్టమొదటి చాంపియన్ షిప్ ను గెలుచుకున్న జట్టు సభ్యులందరూ గల ఈ ప్రాబబుల్స్ జాబితాలో పియూష్ చావ్లా, అజిత్ అగార్కర్ పేర్లు కూడా లేవు. కాలి మడమ గాయం నుంచి శ్రీశాంత్ ఇంకా కోలుకుంటూండగా, శర్మ, చావ్లా, అగార్కర్ లను ఎంపక చేయకపోవడానికి కారణాలు తెలియరాలేదు. ఆటగాళ్ల ఎంపిక గురించి మాట్లాడే అధికారం బోర్డుకు లేదని, అది పూర్తిగా సెలక్టర్లకు సంబంధించిన విషయమని బిసిసిఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ చెప్పారు. దాదాపు ఎనిమిది నెలల విరామం తరువాత రాబిన్ ఉతప్పకు జాతీయ జట్టులో మళ్లీ స్థానం లభించగా, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ప్రొఫెషనల్స్ ట్వంటీ చాంపియన్ షిప్ లకు దూరంగానే ఉంటున్నారు.
జట్టు సభ్యులు: వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఎం.ెస్.ధోని, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రగ్యన్ ఓఝా, హర్భజన్ సింగ్, ప్రవీణ్ కుమార్, దినేష్ కార్తిక్, ఎం.విజయ్, ఎ.రహానె, ఎస్.బద్రినాథ్, రాబిన్ ఉతప్ప, విరాట్ కోహ్లి, మనోజ్ తివారి, వృద్ధిమాన్ సాహా, అభిషేక్ నాయర్, అమిత్ మిశ్రా, ఆర్.అశ్విన్, ఆర్.పి. సింగ్, ఎల్.బాలాజీ, ధావల్ కులకర్ణి, నామన్ ఓఝా. ఈ 30 మంది ప్రాబబుల్స్ నుంచి తుది జట్టు కోసం 15 మందిని ఎంపిక చేస్తారు.
News Posted: 4 April, 2009
|