పటిష్ఠ స్థితిలో ఇండియా
వెల్లింగ్టన్ : వెల్లింగ్టన్ బేసిన్ రిజర్వ్ మైదానంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడవ, ఆఖరి క్రికెట్ టెస్ట్ లో ఆదివారం మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తన రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఆటను నిర్ణీత సమయానికి ముందుగానే నిలిపివేశారు. అప్పటికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 16, యువరాజ్ సింగ్ 15 పరుగులతో ఆడుతున్నారు. భారత జట్టు ఇప్పటికి మొత్తం 531 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. ఇదే స్కోరుకు భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినప్పటికీ గెలిచి సీరీస్ ను సమం చేసుకోవడానికి న్యూజిలాండ్ కు ఈ స్కోరును అధిగమించడం కష్టమే అవుతుంది. అయినప్పటికీ ఇంకా పూర్తిగా రెండు రోజుల వ్యవధి ఉన్నందున ఆట ఎలా అయినా మలుపు తిరగవచ్చు. అయితే, భారత జట్టు సోమవారం నాలుగవ రోజు కనీసం లంచ్ విరామం వరకు బ్యాట్ చేసి తన రెండవ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అప్పుడు కివీస్ కు ఈ టెస్ట్ లో విజయావకాశాలు మృగ్యమేనని అనవచ్చు.
అంతకుముందు న్యూజిలాండ్ రెండవ కొత్త బంతిని తీసుకున్నప్పుడు సెంచరీ వీరుడు గౌతమ్ గంభీర్, హాఫ్ సెంచరీ చేసిన వివిఎస్ లక్ష్మణ్ త్వరితగతిన అవుటయ్యారు. లక్ష్మణ్ ఆఫ్ స్టంప్ ను పడగొట్టడంతో ఇయాన్ ఓబ్రియన్ తన రెండవ వికెట్ తీసుకున్నాడు. లక్ష్మణ్ చేసిన 61 పరుగుల స్కోరులో తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. అంతకు ముందు ఓవర్ లో గంభీర్ ను ఎల్ బిడబ్ల్యు కింద అవుట్ చేయడం ద్వారా అద్భుతమైన అతని ఇన్నింగ్స్ కు ఓబ్రియన్ ముగింపు పలికాడు. గంభీర్ 167 పరుగులు చేశాడు. అతని స్కోరులో రెండు సిక్సర్లు, 16 బౌండరీలు ఉన్నాయి. అతను లక్ష్మణ్ తో జతగా నాలుగవ వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
టీ విరామానికి ముందు కివీస్ కెప్టెన్, ఎడమచేతి వాటం స్పిన్నర్ డేనియల్ వెట్టోరి భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వికెట్ తీసుకోవడంతో భారత జట్టు తన మూడవ వికెట్ ను 208 వద్ద కోల్పోయింది. ఉదయం ఒక వికెట్ నష్టానికి 51 పరుగుల స్కోరుతో జట్టు రెండవ ఇన్నింగ్స్ ను కొనసాగించిన గంభీర్, రాహుల్ ద్రావిడ్ లంచ్ విరామానికి అదనంగా 119 పరుగులు జోడించారు. వెట్టోరి బంతిని బౌండరీకి తరలించి ద్రావిడ్ తన 57వ హాఫ్ సెంచరీని సాధించాడు. ఇది అతనికి ఈ సీరీస్ లో నాలుగవది. అంతకుముందు ద్రావిడ్, గంభీర్ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ద్రావిడ్ కు ప్రమేయం ఉన్న 76వ సెంచరీ భాగస్వామ్యం. లంచ్ విరామానంతరం మూడవ ఓవర్ లో ద్రావిడ్ 60 వ్యక్తిగత పరుగులకు వెట్టోరి బౌలింగ్ లో వికెట్ కీపర్ బ్రెండన్ మెక్ కుల్లుమ్ క్యాచ్ కు అవుటయ్యాడు. ద్రావిడ్, గంభీర్ జతగా రెండవ వికెట్ కు 170 పరుగుల భాగస్వామ్యం నెలకొ
News Posted: 5 April, 2009
|