విజయానికి వెలుతురు బ్రేక్!
వెల్లింగ్టన్: మూడో క్రికెట్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఇండియా విజయానికి వెలుతురు అడ్డుపడింది. 617 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరగులు సాధించింది. ఈ లోగా రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక క్యాచ్(183)లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు మార్క్ వా(181) పేరున ఉంది. విజయానికి ఇంకా 450 పరుగులు అవసరం కాగా, వెలుతురు సరిగా లేని కారణంగా అంపైర్లు ఆట నిలిపివేశారు. అప్పటికి రాస్ టేలర్ 69, జేమ్స్ ఫ్రాంక్లిన్ 26 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. ఏ మాత్రం సాద్యం కాని 617 పరుగులు లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ నాలుగో రోజు టీ విరామ సమయానికి ముందే 136 పరుగులకు 4 వికెట్లు - మెకింటోష్(4), ఫ్లిన్(10), గుప్టిల్(49), రైడర్(0)- కోల్పోయింది. మిగిలినవారు చివరి రోజంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడితే తప్ప కనీసం డ్రా చేసుకోవడం సాధ్యం కాదు.
జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ పరుగులకు కళ్లెం వేశారు. అంతకు ముందు ఆట ప్రారంభమై 75 నిముషాల తరువాత, 7 వికెట్ల నష్టానికి 434 పరగుల స్కోరు వద్ద ధోని తమ రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. అప్పటికే ధోని తన 16వ అరధ సెంచరీ పూర్తి చేసి 56 పరుగులతో నాటౌట్ గా వున్నాడు. ఆ తరువాత న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ లో ద్రవిడ్ రికార్డు నమోదయింది. ఓపెనింగ్ బ్యాట్స్ మన్ మెకింటోష్(4), జహీర్ ఖాన్ వేసిన బంతిని స్లిప్ లో ఉన్న ద్రవిడ్ చేతిలో పడేశాడు. ఆ తరువాత రైడర్ క్యాచ్ కూడా అతడే పట్టుకున్నాడు. ఇంతవరకూ 134 టెస్ట్ మ్యాచ్ లు ాడిన రాహుల్ ద్రవిడ్ 247 ఇన్నింగ్స్ లో 26 సెంచరీలు, 57 అర్ధ సెంచరీలతో 10,823 పరుగులు చేశాడు. ఆదివారం వెలుతురు సరిగా లేక ఆట నిలిచిపోవడంతో సోమవారం అరగంట ముందుగా మొదలు పెట్టారు.
News Posted: 6 April, 2009
|