'గోడ' ఎక్కిన రికార్డు!
వెల్లింగ్టన్: 'ది వాల్'గా క్రికెట్ ప్రపంచంలో పేరుపొందిన గ్రేట్ బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్(36) సోమవారం మరో రికార్డు సృష్టించాడు. అత్యధిక టెస్ట్ క్యాచ్ లు పట్టిన క్రికెటర్ గా రికార్డు పుటల్లో చేరాడు. ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడి బేసిన్ రిజర్వు గ్రౌండ్ లో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభంలో జహీర్ ఖాన్ వేసిన బంతిని ఓపెనింగ్ బ్యాట్స్ మన్ మెకింటోష్ ఆడగా అది మూడో స్లిప్ లో వున్న ద్రవిడ్ చేతికి చిక్కింది. ఇంతవరకూ ఆస్ట్రేలియా ఆటగాడు మార్క్ వా పేరిట వున్న రికార్డు(181)ను ద్రవిడ్ అధిగమించాడు. ఆనందం పట్టలేక చేతిలో వున్న బంతిని ముద్దుపెట్టుకున్నాడు. అంతలోనే సహచరులందరూ అతడిని చుట్టుముట్టేసి అభినందించారు. ఆ తరువాత జెస్సీ రైడర్ క్యాచ్ కూడా ద్రవిడ్ పట్టుకున్నాడు.
క్రికెట్ పుట్టిల్లుగా ఖ్యాతి గాంచిన ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానంలో 1996లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన రాహుల్ ద్రవిడ్ ఇంతవరకూ 134 మ్యాచ్ లు ఆడి, 26 సెంచరీలు, 57 అర్ధ సెంచరీలతో 10823 పరుగులు చేశాడు. అత్యధిక టెస్ట్ క్యాచ్ లు పట్టిన క్రికెటర్లు: (1)రాహుల్ ద్రవిడ్(ఇండియా)134 మ్యాచ్ లు, 247 ఇన్నింగ్స్, 183 క్యాచ్ లు (2)మార్క్ వా(ఆస్ట్రేలియా)126-245-181 (3)స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్)111-199-171 (4)బ్రియాన్ లారా(వెస్టిండీస్)131-241-164 (5)మార్క్ టేలర్(ఆస్ట్రేలియా)104-197-157 (6)అలన్ బోర్డర్(ఆస్ట్రేలియా)156-277-156.
News Posted: 6 April, 2009
|