ఇండియాకే టెస్ట్ సీరీస్
వెల్లింగ్టన్ : వెల్లింగ్టన్ బేసిన్ రిజర్వ్ మైదానంలో భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ, ఆఖరి క్రికెట్ టెస్ట్ డ్రా గా ముగిసింది. ఐదవ రోజు మంగళవారం లంచ్ విరామం అనంతరం వర్షం పడడంతో ఆట సాధ్యం కాలేదు. గెలుపు కోసం 617 పరుగుల అసాధ్య లక్ష్యాన్ని ఛేదిస్తున్న కివీస్ జట్టు వర్షం మొదలైన సమయానికి తన రెండవ ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్ల నష్టానికి 281 పరుగులు స్కోర్ చేసింది.ఈ టెస్ట్ మ్యాచ్ లో సానుకూల ఫలితం కోసం ఇండియా చేయని ప్రయత్నం లేదు. కాని ఆతిథేయ జట్టు వికెట్ల వద్ద పాతుకుపోయారు. భారత జట్టు తన రెండవ ఇన్నింగ్స్ ను ఆలస్యంగా డిక్లేర్ చేయడం, అననుకూల వాతావరణం కలగలిసి న్యూజిలాండ్ డ్రాతో తప్పించుకోవడానికి వీలు కలిగింది.
అయితే, ఇండియా మూడు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ ను 1-0తో గెలుచుకుని 41 సంవత్సరాల అనంతరం న్యూజిలాండ్ గడ్డపై తమ తొలి సీరీస్ విజయాన్ని కైవసం చేసుకోగలిగింది. కాగా విదేశాలలో ఇండియాకు మొత్తంగా ఇది 13వ సీరీస్ గెలుపు. హామిల్టన్ లో మొదటి టెస్ట్ ను ఇండియా గెలుచుకోగా నేపియర్ లో రెండవ టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం విదితమే. కాగా, బ్యాట్ తో అత్యద్భుతంగా రాణించినందుకు ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ప్రకటించారు.
అయితే, వెల్లింగ్టన్ లో ఇండియా కష్టాలు కొనసాగాయి. భారత జట్టు బేసిన్ రిజర్వ్ మైదానంలో 1968 ఫిబ్రవరి తరువాత ఒక్క టెస్ట్ కూడా గెలుచుకోలేకపోయింది. అంతే కాకుండా జట్టు తన నూరవ టెస్ట్ మ్యాచ్ విజయాన్ని కూడా నమోదు చేసుకోలేకపోయింది.
నాలుగు వికెట్ల నష్టానికి 167 స్కోరుతో ఉదయం తన రెండవ ఇన్నింగ్స్ ను కొనసాగించిన న్యూజిలాండ్ ఆట ముగిసే లోపు మరి 114 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయారు. మంగళవారం హర్భజన్ సింగ్, సచిన్ టెండూల్కర్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. హర్భజన్ ఈ ఇన్నింగ్స్ లో మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. 69 పరుగులతో ఉదయం ఆటను కొనసాగించిన రాస్ టేలర్ క్రమంగా సెంచరీ పూర్తి చేసి 107 పరుగులకు హర్భజన్ ఓవర్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతరువాత జేమ్స్ ఫ్రాంక్లిన్ (49). బ్రెండన్ మెక్ కల్లమ్ (6) వికెట్లను సచిన్ తీసుకున్నాడు. టిమ్ సౌతీ వికెట్ హర్భజన్ కు లభించింది. సౌతీ కొట్టిన బంతిని మహేంద్ర సింగ్ ధోని క్యాచ్ చేశాడు. డేనియల్ వెట్టోరి 15, ఇయాన్ ఓబ్రియన్ 19 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
News Posted: 7 April, 2009
|