'మరో పది ఓవర్లు ఆడితే...'
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ జట్టుతో ఇక్కడి బేసిన్ రిజర్వ్ గ్రౌండ్ లో జరిగిన మూడో(చివరి) టెస్ట్ డ్రాగా ముగియడంతో భారతజట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిరాశ చెందాడు. మరొక్క పది ఓవర్లు ఆట జరిగి వుంటే మొత్తం కివీస్ జట్టందర్నీ తుడిచిపెట్టేసే వాళ్లమనీ, కాని అంతలోనే వర్షం ముంచుకు వచ్చి, తన ఆశల మీద నీళ్లు జల్లేసిందనీ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ధోని చెప్పాడు. మూడు టెస్ట్ మ్యాచ్ ల ఈ సిరీస్ ను ఇండియా 1-0తో కైవసం చేసుకుని, 41 సంవత్సరాల తరువాత మళ్లీ న్యూజిలాండ్ లో సిరీస్ విజయం సాధించింది. హామిల్టన్ లో జరిగిన మొదటి టెస్ట్ లో ఇండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందగా, నేపియర్ లో జరిగిన రెండో టెస్ట్ డ్రా అయింది. మూడో టెస్ట్ చివరిరోజు(మంగళవారం) మరికొన్ని ఓవర్లు ఆడే వీలుంటే తప్పకుండా గెలిచేవాళ్లమని ధోని అన్నాడు. నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగుల స్కోరుతో ఐదో రాజు తమ రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన న్యూజిలాండ్ లంచి విరామం లోపునే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. స్కోరు 281 వద్ద ఉండగా వర్షం మొదలై మరి ఆట సాధ్యం కాకుండా చేసింది. 1967-68 సిరీస్ లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సారథ్యంలోని భారతజట్టు న్యూజిలాండ్ లో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది.
ఓపెనింగ్ బ్యాట్స్ మన్, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గౌతమ్ గంభీర్ ను ధోని ఎంతగానో మెచ్చుకున్నాడు. న్యూజిలాండ్ లో ఇంత గొప్పగా ఆడ్డమే ఓ సవాలనీ, దానిని గంభీర్ అద్భుతంగా ఎదుర్కొన్నాడనీ ధోని ప్రశంసించాడు. 183 క్యాచ్ లతో కొత్త టెస్ట్ రికార్డు సృష్టించిన మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కు అతడు క్యాచ్ పట్టిన బంతిని బహూకరించారు. సిరీస్ ఓటమితో నిరాశచెందిన న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి తమ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్, జెస్సీ రైడర్, బ్రెండన్ మెకల్లమ్ అద్భుతంగా ఆడారని, గెలవాలనే పట్టుదలతో మ్యాచ్ లు ఆడారని అభినందించాడు.
News Posted: 7 April, 2009
|