ఐపిఎల్ కవరేజికి ఓకే!
జోహాన్స్ బర్గ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎలి) రెండో సీజన్ మ్యాచ్ ల ప్రసారం, ప్రచురణలకు అవరోధాలు తొలగిపోయాయి. మీడియా సంస్థలకు విధించిన ప్రతికూలమైన షరతులను ఉపసంహరించుకోడానికి టోర్నమెంట్ నిర్వాహకులు అంగీకరించడంతో, ప్రధానమైన అంతర్జాతీయ వార్తా సంస్థలు టోర్నమెంట్ కవరేజికి సమ్మతించాయి. వివిధ మీడియా సంస్థల ప్రపంచ సంఘం న్యూస్ మీడియా సంకీర్ణం(ఎన్.ఎం.సి), ఐపిఎల్ నిర్వాహకుల మధ్య చర్చలు కొలిక్కి రావడంతో, ఏప్రిల్ 18న ప్రారంభం కానున్న ట్వంటీ టోర్నమెంట్ ప్రసారాలపై అనిశ్చితి తొలగిపోయింది. ైదు వారాలపాటు జరిగే టోర్నమెంట్ ను వివరాలు, పోటోలను ప్రసారం చేయడానికి అంతర్జాతీయ వార్తా సంస్థలు అసోసియేటెడ్ ప్రెస్(ఎపి), ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్(ఎ.ఎఫ్.పి), రాయిటర్స్ అంగీకరించాయి. మ్యాచ్ లకు సంబంధించిన వార్తలు, ఫోటోలను ఈ సంస్థలు వెబ్ సైట్ లకు సప్లై చేయరాదన్న తమ షరతును టోర్నమెంట్ నిర్వాహకులు ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ వార్తా మీడియా పరిశ్రమతో ఈ ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్.ఎం.సి ప్రతినిధి ఆండ్రూ మోగర్, ఎపి అసియేట్ జనరల్ కౌన్సెల్ డేవ్ టామ్లిన్ కొత్త ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
News Posted: 10 April, 2009
|