కెకెఆర్ కెప్టెన్ మెకల్లమ్
కేప్ టౌన్: కోల్కటా నైట్ రైడర్స్(కెకెఆర్) జట్టులో బహుళ కెప్టెన్ వివాదం ప్రస్తుతానికి సమసి పోయినట్టే కనిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ లో పూర్తిగా ఆ జట్టు కెప్టెన్ గా బ్రెండన్ మెకల్లమ్ నియమితుడయ్యాడని కెకెఆర్ జట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. గత సంవత్సరం ఈ షారుక్ ఖాన్ జట్టు కెకెఆర్ కు సారథ్యం వహించిన భారతజట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో మెకల్లమ్ నియమితుడయ్యాడు. ఈ నియామకాన్ని బట్టి ఐపిఎల్ మ్యాచ్ ల్లో మెకల్లమ్ టాస్ కి వెళ్తాడు, క్రిస్ గేల్ తో పాటు సౌరవ్ గంగూలీ జట్టులో ని సీనియర్ సభ్యుడి హోదాలో కొనసాగుతాడని అర్ధమవుతుంది. ట్వంటీ20 ఆటలో నైపుణ్యం ఆధారంగా మాత్రమే కాకుండా టోర్నమంట్ జరిగే అన్ని రోజులూ అందుబాటులో ఉంటాడన్న కారణంగా మెకల్లమ్ ను జట్టు కెప్టెన్ గా ఎంపిక చేసి ఉంటారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కెకెఆర్ జట్టు ఆడుతున్న ప్రాక్టీసు మ్యాచ్ లలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క కెప్టెన్ ను నియమిస్తున్నారు. అయితే ఇది ప్రయోగాత్మకంగా జరుగుతోందో, లేక టోర్నమెంట్ లో కూడా అప్పుడప్పుడు ఆచరణలో పెట్టదలచుకున్నారో ఇప్పుడప్పుడే స్పష్టం కాదు.
News Posted: 17 April, 2009
|