ముంబై ఇండియన్స్ బోణీ
కేప్ టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ అద్భుతంగా ప్రారంభమయింది. న్యూలాండ్స్ స్టేడియంలో శనివారం జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన అనుభవాన్నంతా రంగరించి 59(నాటౌట్) పరుగులు సాధించడమే కాకుండా, గత సంవత్సరం రన్నర్ అప్, మహోంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. బౌలర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్ మీద తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా, చెన్నై జట్టు బ్యాటింగ్ చేసినప్పుడు వ్యూహాత్మకంగా బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు చేస్తూ ధోనీతో సహా ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశాడు. విశేషమేమిటంటే, క్రితం సారి ఇండియాలో ఐపిఎల్ జరిగినప్పుడు ప్రేక్షకులకు కనువిందు చేసిన సిక్సర్లు, ఇక్కడి ఫాస్ట్ పిచ్ ల మీద అంత పెద్ద సంఖ్యలో కనిపించలేదు.
చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలో అదని నిర్ణయం సరైనదే అనిపించింది. ముంబై ఓపెనర్లు శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య, సచిన్ టెండుల్కర్ లను అదుపుచేయడంలో చెన్నై బౌలర్లు కొంతవరకు కృతకృత్యులు కాగలిగారు. జయసూర్య 20 బంతుల్లో 26 పరుగులకు ఔట్ కాగా, టెండుల్కర్ ఐపిఎల్ లో తన రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి సచిన్ 59 పరుగులతో నాటౌట్ గా వున్నాడు. ఇన్నింగ్స్ సగం వరకూ నిదానంగా ఆడిన సచిన్ పదకొండో ఓవర్ నుంచి విజృంభించాడు. ముంబాయి ఆటగాడు అభిషేక్ నయర్ చివర్లో మెరుపులు మెరిపంచడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఆండ్రూ ఫ్లింటాఫ్ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన నయర్ 14 బంతులు ఎదుర్కొని 35 పరుగులకు ఔటయ్యాడు. చెన్నై బౌలర్లలో మన్ ప్రీత్ గొని 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
News Posted: 18 April, 2009
|