వీరూ 'డెవిల్స్' విజయం
కేప్ టౌన్: వర్షం... వర్షం... వర్షం! దక్షిణాఫ్రికా వాతావరణం ఐపిఎల్ టోర్నమెంట్ ను సజావుగా సాగనిచ్చేలా లేదు. రెండో రోజు(ఆదివారం) మొదటి మ్యాచ్ అడపా తడపా కురిసిన వర్షం కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడమే కాకుండా, 12 ఓవర్లకే పరిమితమయింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ వీరేందర్ సెహ్వాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఆ తరువాత ఢిల్లీ ఓపెనర్లు గౌతమ్ గంభీర్, సెహ్వాగ్ స్వైరవిహారం చేశారు. అప్పటికి మళ్లీ వర్షం పడి, ఆట ఆగిపోవడంతో, ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని మరోసారి కుదించి, 6 ఓవర్లలో 54 పరుగులుగా నిర్దేశించారు. గంభీర్ 13 బంతుల్లో రెండు బౌండరీలతో 15 పరుగులు చేసి నిదానంగా ఆడగా, సెహ్వాగ్ 16 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు బౌండరీలతో 38 పరుగులు చేసి డెవిల్స్ జట్టుకు వికెట్ నష్టపోకుండా నాలుగు ఓవర్లలోనే 58 పరుగులు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు పంజాబ్ జట్టు ఇన్నింగ్స్ లో ఓపెనర్లు రవి బొపార 16 బంతుల్లో రెండు సిక్సర్లతో 22 పరుగులు, కరణ్ గోయెల్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 38 పరుగులు చేశారు. ఆ తరువాత డెవిల్స్ స్పిన్నర్, న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు. కింగ్స్ లెవెన్ కెప్టెన్ యువరాజ్ సింగ్ 16 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఈ జట్టులో కుమార సంగక్కర 8, మహేల జయవర్దన 6, ఇర్ఫాన్ పఠాన్ 6, పియూష్ చావ్లా 0, తరువార్ కొహ్లి(నాటౌట్)0 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో అవిష్కార్ సాల్వి 1, మహేశ్ 1 వికెట్లు తీసుకోగా ఇద్దరు బ్యాట్స్ మెన్ రనౌట్ అయ్యారు.
News Posted: 19 April, 2009
|