మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఆల్ రౌండ్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ వివాదాలకు దూరంగా ఉండలేడనిపిస్తోంది. తాజా ఆరోపణల ప్రకారం సైమండ్స్ తన ఆటోగ్రాఫ్ గల క్రికెట్ బ్యాట్ ను తాకట్టు పెట్టి లక్షలాది డాలర్ల రుణం తీసుకుని ఓ నష్టాల కంపెనీలో పెట్టుబడిగా పెట్టాడు. కామన్వెల్త్ బ్యాక్ ఆఫ్ ఆస్ట్రేలియా నుంచి తీసుకున్న రుణాన్ని సైమండ్స్ స్టార్మ్ ఫైనాన్షియల్ సర్విసేస్ లో మదుపుగా పెట్టాడని ఆ కంపెనీ మాజీ అధికారి ఒకరు చెప్పినట్టు 'ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' పత్రిక వెల్లడించింది. ఈ స్టార్ట్ కంపెనీ మాజీ అధికారే సైమండ్స్ తరఫున క్వీన్స్ లాండ్ లోని కామన్వెల్త్ బ్యాంకు బ్రాంచిలో రుణానికి సంబంధించిన లావాదేవీలు నిర్వహించినట్టు స్వయంగా సంతకం చేసిన అఫిడవిట్ లో ఆయనే పేర్కొన్నారు.
గత జనవరిలో ఆ కంపెనీ దివాళా తీయడంతో సైమండ్స్ సుమారు 10 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు నష్టపోయాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిబ్బంది ఒకరు సైమండ్స్ బ్యాట్ ను 2007లో తాకట్టుకు స్వీకరించారని బ్యాంక్ ఉన్నతాధికారులు అంగీకరించారు. అయితే సైమండ్స్ విఐపిగా పరిగణించారన్న ఆరోపణను వారు తిరస్కరించారు. తాకట్టు ద్వారా వచ్చిన సొమ్మును సైమండ్స్ స్టార్మ కంపెనీకి చెందిన రెండు ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ కోసం పెట్టుబడిగా అందజేశాడు.