గేల్ కు మెకల్లమ్ ప్రశంస
డర్బాన్: క్రిస్ గేల్ ఫామ్ లో వున్నప్పుడు ప్రపంచంలో ఏ మైదానం అతడికి పెద్దది కాదని, ఎప్పుడూ చిన్న చిన్న మైదానాల్లో ఆడే న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మన్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లో తొలివిజయాన్ని చవిచూసిన ఈ కోల్కటా నైట్ రైడర్స్ కెప్టెన్ తమ విజయానికి కారకుడైన క్రిస్ గేల్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో హైదరాబాద్ డక్కన్ ఛార్జర్స్ చేతిలో పరాజయం పొందిన మెకల్లమ్, మంగళవారం పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టును ఓడించే అవకాశం రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. తమ ఇన్నింగ్సు ప్రారంభంలో వర్షం వల్ల ఆట ఆగిపోయి డక్ వర్త్-లూయీస్ నిబంధన తమకు కలిసి వచ్చినా, క్రిస్ గేల్ చెలరేగి ఆడుతుండడం వల్ల గెలుస్తామన్న నమ్మకం ఏర్పడిందని మెకల్లమ్ చెప్పాడు.
'ఓపెనర్ గా క్రిస్ అధ్భుతంగా ఆడాడు. ఆ పరిస్థితులలో అతడికి అతడికి తప్ప ఆ పిచ్ మీద అంతగా విజృంభించి ఆడడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. ఎంత పెద్ద గ్రౌండయినా బంతిని సునాయాసంగా బౌడరీ మీదుగా పెవిలియన్ లో పడేలా కొట్టగల సమర్ధుడు క్రిస్'అని మెకల్లమ్ అభినందించాడు. తమ విజయం ఎంతో 'సిల్లీ'గా అనిపించినప్పటికీ మళ్లీ ఫామ్ లోకి వచ్చి భారీ స్కోరు సాధించగలగడం సంతృప్తికరంగా ఉందని క్రిస్ గేల్ చెప్పాడు. పెద్ద పెద్ద షాట్ లు కొట్టే ఉద్దేశంతోనే బ్యాటింగుకు దిగారా? అన్న ప్రశ్నకు 'అదేం కాదు. మొదటి రెండు ఓవర్లు ెటువంటి నష్టం లేకుండా ముగిసిపోవడం ముఖ్యమని తెలుసు. ఆ తరువాత మనిష్టం వచ్చినట్టు షాట్ లు కొట్టవచ్చు' అని క్రిస్ జవాబిచ్చాడు.
News Posted: 22 April, 2009
|