పీటర్సన్ పై మోడి సీరియస్
పోర్ట్ ఎలిజబెత్: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు పట్టడంపై ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడి అసహనం వ్యక్తం చేశారు. తాను ఎల్.బి.డబ్ల్యూగా ఔటయినట్టు ఆస్ట్రేలియా అంపైర్ సైమన్ టాఫెల్ నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు పీటర్సన్ ను మ్యాచ్ రిఫరీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత మోడి మీడియాతో మాట్లాడుతూ 'ఐపిఎల్ మ్యాత్ లలో ప్రతి సంఘటననూ జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఏ ఆటగాడైనా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే ఎంతమాత్రం సహించరాదనే విధానాన్ని పాటిస్తున్నాం. పూర్తిగా క్రీడాస్ఫూర్తితో పోటీలు జరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. నేటి యవతరానికి తాము రోల్ మోడల్స్ లా వ్యవహరించాలన్న విషయాన్ని క్రికెటర్లు మరచిపోకూడదు. ప్రపంచంలో అందరి కళ్లూ ఐపిఎల్ మీదనే కేంద్రీకరించి ఉన్నాయి' అని మోడి హెచ్చరించారు.
కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇక్కడి పోటీలు లీగ్ దశ ముగిసి నాకౌట్ దశకు చేరుకునే సమయానికి మళ్లీ వస్తారనే ఆశాభావాన్ని మోడి వ్యక్తం చేశారు. 'వాళ్ల జట్లు నాకౌట్ దశకు చేరుకుంటే ఆ ఇద్దరూ వస్తారనే ఆశిస్తున్నాం. కాని ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకోవలసింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు' అని మోడి చెప్పారు. కాని, అలా జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఐపిఎల్ సెమీ ఫైనల్స్ మే 22, 23 తేదీల్లో జరుగనుండగా, ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య మే 21, 24 తేదీల్లో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు జరగనున్నాయి.
News Posted: 22 April, 2009
|