హ్యాపీ బర్త్ డే సచిన్!
కేప్ టౌన్: మాస్టర్ బ్యాట్స్ మన్ సచిన్ రమేష్ టెండుల్కర్ శుక్రవారం 36వ జన్మదినోత్సవం జరుపుకున్నాడు. 'భారతదేశానికి ప్రపంచ కప్ సాధించిపెట్టడమే' తన ఆకాంక్ష అని ఈ సందర్భంగా సచిన్ చెప్పాడు. ఆధనిక క్రికెట్ లో అనితర సాధ్యమైన ఎన్నో అత్యున్నత రికార్డులు సొంతం చేసుకున్న ఈ లిటిల్ మాస్టర్ వరల్డ్ కప్ విజేత మెడల్ ధరించలేకపోవడం నిజంగా విచారకరమే! 2011లో భారత ఉపఖండంలో జరిగే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఆ లోటు కూడా తీర్చుకుంటానని శపథం చేశాడు. 'ఇది పగటి కల కాదు. ఎవరికైనా నిద్రపోయేటప్పుడే కలలు వస్తాయి. భారతదేశానికి ప్రపంచ కప్ ని సాధిస్తాను' అని ఇటీవల ఒక ఫంక్షన్ లో సచిన్ అన్నాడు. క్రికెట్ కి సంబంధించినంతవరకూ తాను జీవితంలో మరచిపోలేని జన్మదినం 1998 ఏప్రిల్ 24న జరిగిందని గుర్తు చేసుకున్నాడు.
ఆ రోజు షార్జాలోజరిగిన ట్రయాంగ్యులర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై సచిన్ సెంచరీతో భారతజట్టును గెలిపించాడు. అంతకుముందు రోజు అదే జట్టుపై అతడు చేసిన సెంచరీ(141)తో భారతజట్టు ఫైనల్స్ లో ప్రవేశించింది. ఆ విజయమే తాను మరువలేని జన్మదిన కానుకగా అభివర్ణించాడు. కేప్ టౌన్ లో భారతజట్టు సహచరులు వారు బసచేసిన హోటల్ లోనే బర్త్ డే పార్టీ ఏర్పాటుచేసి, సచిన్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ అతడిచేత కేక్ కట్ చేయించి ఆనందం పంచుకున్నారు. 'ఇప్పడు నేను పదహారేళ్లవాడిలా ఫీలవుతున్నాను. మిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు, అభిమానమే అందుకు కారణం'అన్నాడతడు. డర్బాన్ లో జరిగే సచిన్ జన్మదిన వేడుకల్లో అతడి భార్య అంజలి, పిల్లలు పాల్గొంటారు.
News Posted: 24 April, 2009
|