'విరామం'పై మోడీ వివరణ
డర్బాన్: వ్యూహాత్మక విరామం(స్ట్రాటెజిక్ బ్రేక్) వంటి వినూత్న విధాన నిర్మయాలను ఐపిఎల్ రెండో సీజన్ టోర్నమెంట్ ముగిసిన తరువాత సమీక్షిస్తామని కమిషనర్ లలిత్ మోడి చెప్పారు. ఈ యేడాది పోటీల్లో ప్రతి పది ఓవర్లకు ఒకసారి ఏడున్నర నిముషాల విరామాన్ని ఇవ్వడం సర్వత్రా విమర్శలకు గురయింది. ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని సచిన్ టెండుల్కర్ తదితర ప్రముఖ ఆటగాళ్లు ఈ విషయమై చేసిన వ్యాఖ్యలకు మోడి ప్రతిస్పందిస్తూ, టోర్నమెంట్ ముగిసిన తరువాత కొత్త నిర్ణయాలను సమీక్షించే సమయంలో వారి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 'ఇది ఈ యేడాది ప్రయోగాత్మకంగా అమలుపరుస్తున్న వినూత్న విధానం మాత్రమే' అని ఐపిఎల్ వెబ్ సైట్ లో పేర్కొన్నారు.
'దక్షిణాఫ్రికాలో విజేతకు కిరీట ధారణ పూర్తయ్యాక, రెండో సీజన్ టోర్నమెంట్ ముగిసిన తరువాత వచ్చే యేడాది జరిగే డి.ఎల్.ఎఫ్ ఐపిఎల్ మూడో సీజన్ విధానాలకు మెరుగులు దిద్దే అసలు పని మొదలవుతుంది. ఆ సమయంలో అంతవరకూ అమలైన విదానాలను కూలంకషంగా సమీక్షించి, వాటిని కొనసాగించాలా లేక మార్పులు చేయాలా లేక తొలగించాలా అనే నిర్ణయం తీసుకుంటాం' అని మోడి పేర్కొన్నారు. మరిన్ని వ్యాపార ప్రకటనల ప్రసారానికి వీలు కల్పించి సొమ్ము చేసుకోడానికే స్ట్రాటెజిక్ బ్రేక్ ను ప్రవేశపెట్టారని మీడియాలో వచ్చిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఈ బ్రేక్ వినూత్న విధాన నిర్ణయమేనని, పది ఓవర్లు పూర్తయ్యాక ఆయా జట్లు వ్యూహాలను మార్చుకోడానికి కోచ్ లతో అవసరమైన సంప్రదింపులకు ఈ విరామం అవకాశం కల్పిస్తుందని ఆయన వివరించారు.
News Posted: 24 April, 2009
|