'మా ప్లాన్ ఫలించింది'
డర్బన్: ఐపిఎల్ రెండో సీజన్ లో తొలి విజయం సాధించిన కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ యువరాజ్ సింగ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. శుక్రవారం బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో ఆడిన మ్యాచ్ పంజాబ్ జట్టుకు ప్రస్తుత టోర్నీలో మూడోది. అంతకు ముందు రెండు మ్యాచ్ లలో బాగానే ఆడినప్పటికీ వర్షం ఆ జట్టు విజయానికి అడ్డుపడింది. బెంగుళూరు జట్టుకు అది వరుసగా మూడో పరాజయం. 'దేవుడి దయ వల్ల వర్షం పడలేదు. పిచ్ కూడా మాకు బాగా అనుకూలించింది. రవి బొపారా(85) బ్యాటింగ్ అద్భుతం! మాప్రయోగాలన్నీ ఫలించాయి' అన్నాడు యువరాజ్. వికెట్లు కాపాడుకుంటూ, లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లె ఓవర్లలో ఓళ్లు దగ్గర పెట్టి ఆడాలని మ్యాచ్ ప్రారంభానికి ముందే ప్లాన్ చేశామని బొపారా చెప్పాడు.
తాము క్యాచ్ లు వదిలివేయడం వల్లే కింగ్స్ జట్టు ఈ మ్యాచ్ గెలుచుకో గలిగిందని బెంగుళూరు జట్టు కెప్టెన్ పీటర్సన్ చెప్పాడు. రెండు మూడు క్యాచ్ లు వదిలేస్తే మ్యాచ్ గెలవడం కష్టమేనని, ఓడిపోవడం పరువు తక్కువే అయినా మిగిలిన మ్యాచ్ లలో గెలుపొందడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. 'మా ఇంగ్లండ్ సహచరుడు బొపారా సూపర్ స్టార్ లా ఆడాడు' అని పీటర్సన్ ప్రశంసించాడు.
News Posted: 25 April, 2009
|