కింగ్స్-రైడర్స్ మ్యాచ్ రద్దు
కేప్ టౌన్: ఐపిఎల్ రెండో సీజన్ లో మరో మ్యాచ్ వర్షార్పణమయింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కటా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇక్కడి న్యూలాండ్స్ గ్రౌండ్ లో శనివారం జరగవలసిన మ్యాచ్, భారీ వర్షం కారణంగా రద్దయింది. రెండు జట్లకు చెరో పాయింట్ లభించాయి. ఉదయం నుండీ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో స్టేడియం నీటితో నిండిపోయింది. వర్షం తగ్గితే ఆటను ఐదు ఓవర్లకు కుదించవచ్చనుకున్నారు కాని అది కూడా సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
ఈ మ్యాచ్ జరగకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయింది చెన్నై జట్టే! గత సంవత్సరం రన్నరప్ అయిన ఈ జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడి ఒక్కటి మాత్రమే గెలుచుకుంది. ఇక కోల్కటా జట్టును టోర్నమెంట్ ప్రారంభం నుండీ దురదృష్టం వెన్నాడుతోంది. ఈ మ్యాచ్ కి ముందు ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక్కదాన్ని మాత్రమే అతి కష్టం మీద గెలుచుకుంది. గురువారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ నిర్ణీత 20 ఓవర్లలో టై కావడంతో, సూపర్ ఓవర్ లో కోల్కటా జట్టు ఖంగుతింది.
News Posted: 25 April, 2009
|