ఫ్లింటాప్ రిటైర్డ్ హర్ట్!
లండన్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ మోకాలి నొప్పి కారణంగా ఐపిఎల్ తోపాటు వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. అతడి మోకాలికి శస్త్ర చికిత్స అవసరమైనందు వల్ల వెస్టిండీస్ సిరీస్ నుంచి కూడా తప్పించామని ఇంగ్లండ్ సెలెక్టర్లు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్న ఫ్లింటాఫ్ రెండు మ్యాచ్ లు ముగియగానే మోకాలి నొప్పితో ఇంగ్లండ్ చేరుకున్నాడు. వచ్చేవారం అతడి కుడి మోకాలికి ఆపరేషన్ జరుగుతుంది. ఆ తరువాత ఐదు వారాలపాటు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు.
జూన్ లోజరుగనున్న టి20 వరల్డ్ కప్, ఆ తరువాత జరిగే యాషెస్ సిరీస్ కు ఫ్లింటాప్ అందుబాటులో ఉండగలడని ఆశిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఫ్లింటాఫ్ ను 15.5 లక్షల డాలర్లకు వేలంపాటలో కొనుక్కుంది. శుక్రవారం స్వదేశానికి చేరుకున్న ఫ్లింటాఫ్ డాక్టర్లను సంప్రదించగా, మోకాలికి స్కానింగ్ చేసి, ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.
News Posted: 26 April, 2009
|