మట్టి కరచిన నైట్ రైడర్స్
పోర్ట్ ఎలిజబెత్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోల్కటా నైట్ రైడర్స్ జట్టుకు ఏమాత్రం కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇంతకుముందు వరకూ ఆడిన మూడు మ్యాచ్ లలో ఒకటి మాత్రమే గెలుపొందిన ముంబై జట్టు ఈ మ్యాచ్ లో చెలరేగి, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సనత్ జయసూర్య, కెప్టెన్ సచిన్ టెండుల్కర్ అర్ధ సెంచరీలతో గట్టి పునాది వేశారు. మొదటి వికెట్ కు 12.2 ఓవర్లలో 127 పరుగులు జత చేశారు. సచిన్ 45 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేయగా, జయసూర్య 32 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.
వన్ డౌన్ గా వచ్చిన హర్భజన్ సింగ్ 18, డుమిని(నాటౌట్)18, అభిషేక్(రనౌట్)3, డానే బ్రేవో 3, ధావన్ 12, తివారి(నాటౌట్)4 పరుగులు చేశారు. నైట్ రైడర్స్ బౌలర్లలో లక్ష్మీరతన్ శుక్లా 3, ఇషాంత్ శర్మ, బ్రాడ్ హాడ్జ్ ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. 190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన కోల్కటా జట్టులో హాడ్జ్, సౌరవ్ గంగూలీ మినహా మిగిలినవారు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. హాడ్జ్ 22 బంతుల్లో మూడు ఫోర్లతో 24 పరుగులు, గంగూలీ 30 బంతిల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 34 పరుగులు చేశారు. కెప్టెన్ మెకల్లమ్ 1, క్రిస్ గేల్ 12, యశ్పాల్ 8, శుక్లా 6, ఇషాంత్ 6 పరుగులు చేయగా, ఘోష్ , మెండిస్, దిండా డకౌట్ అయ్యారు. ఫీల్డింగ్ లో గాయపడిన అనురీత్ సింగ్ బ్యాటింగ్ కు రాలేదు. ముంబై బౌలర్లలో మలింగ 3, అభిషేక్ 3, బ్రేవో 2, జహీర్ ఖాన్ 1 వికెట్లు పడగొట్టారు. సచిన్ టెండుల్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
News Posted: 27 April, 2009
|