ఐసిఎల్ ప్లేయర్లకు క్షమాభిక్ష
ముంబాయి: ఇండియన్ క్రికంట్ లీగ్(ఐసిఎల్)ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని రద్దుచేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, ముందు వాళ్లు ఐసిఎల్ తో తెగతెంపులు చేసుకోవాలని షరతు విధించింది. కొంతమంది ఐసిఎల్ ఆటగాళ్లు తమ సిబ్బందితో కలసి బోర్డు సభ్యులను కలుసుకుని, ఐసిెల్ లో చేరి పొరపాటు చేశామని అంగీకరించారని బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వెల్లడించారు. ఐసిఎల్ ఆటగాళ్లు బయటకు వచ్చిన తరువాత ఏడాదిలోగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వబోమని, దేశవాళీ పోటీల్లో మాత్రం వెంటనే పాల్గొనవచ్చనీ, వారికి క్షమాభిక్ష(ఐసిఎల్ ను విడిచిపెట్టడానికి) గడువు మే 31 వరకూ ఉంటుందని బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశం తరువాత విలేఖరులతో మాట్లాడుతూ మనోహర్ వివరించారు.
బ్రియాన్ లారా, ఇంజమాముల్ హక్, షేన్ బాండ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్లు సభ్యులుగా గల ఐసిఎల్ ను, జీ గ్రూప్ యజమాని సుభాష్ చంద్ర, 2007 ప్రపంచ కప్(వెస్టిండీస్) పోటీల్లో భారతజట్టు పరాజయం పొందిన తరువాత, ప్రారంభించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను బిసిసిఐ ఆవిష్కరించి, ఐసిఎల్ కు గుర్తింపు ఇవ్వకుండా, దానిని తిరుగుబాటు(రెబెల్)గ్రూపుగా ప్రకటించి, అందులో సభ్యులుగా గల ఆటగాళ్లపై నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా మిగతా దేశాల క్రికెట్ బోర్డులకు కూడా తన వైఖరినే పాటించమని సలహా ఇచ్చింది.
1983 ప్రపంచ కపి విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ఒక్కడే ఐసిఎల్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, దాని ఎగ్జిక్యూటివ్ విభాగానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంతవరకూ గుర్తింపుకోసం ఐసిఎల్ పదేపదే చాసిన విజ్ఞప్తులను బిసిసిఐతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రతిసారీ తిరస్కరించాయి. ఈ నెల ప్రారంభంలో కూడా ఐసిెల్ పంపిన దరఖాస్తును ఐసిసి మరోసారి తిరస్కరించింది. గత సంవత్సరం ముంబాయిలో టెర్రరిస్టుల దాడుల నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా 2009 పోటీలను రద్దుచేయాలని ఐసిఎల్ నిర్ణయించింది.
News Posted: 29 April, 2009
|