'షారుఖ్ ఇక తప్పుకో!'
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు కోల్కటా నైట్ రైడర్స్(కెకెఆర్)అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. కెకెఆర్ లీగ్ మ్యాచ్ లలో 'అద్భుతంగా' ఆడుతున్నందుకు కాదు. యజమాని షారుఖ్ ఖాన్ ఆ జట్టును ఎవరికో అమ్మేసి వెళ్లి పోతున్నందుకట! ఈ వార్తను ఖండిస్తూ, ఎవరితోనూ బేరసారాలు జరపడం లేదని షారుఖ్ చెబుతున్నా, 'తెలివైన'నిర్ణయం తీసుకున్నందుకు షారుఖ్ కు అభినందనలు అంటూ క్రికెట్ నెక్స్ట్ డాట్ కామ్ లో అనేకమంది మెసేజిలు పంపిస్తున్నారట. 'కోల్కటా క్రికెట్ అభిమానులమైన మేము దాదాకు మాత్రమే మద్దతు ఇస్తాం. మీ జట్టును అమ్మేయాలనుకుంటున్నారని తెలిసి సంతోషిస్తున్నాను. కేవలం డబ్బే ప్రధానం కాకుండా, క్రికెట్ గురించి బాగా తెలిసినవారు కెకెఆర్ యజమానిగా వస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు' అని ఫ్యాన్స్ స్పీక్ @క్రికెట్ నెక్స్ట్.కామ్ కు పంపిన ఇ-మెయిల్ లో సౌమ్య సేన్ గుప్తా అనే అభిమాని పేర్కొన్నారు.
మరో అభిమాని 'దాదా మా హృదయాల్లో కలకాలం నిలిచిపోతాడు. నిన్ను నువ్వు బాద్ షా అని పిలుచుకుంటున్నావు. దాదాని మేమంతా ప్రిన్స్ అంటాము. అది ఆయన స్వయంగా ప్రకటించుకున్నది కాదు' అని విమర్శించాడు. బాస్ సి. అనే మరో అభిమాని, కెకెఆర్ జట్టు యాజమాన్యం మీడియా దృష్టిని ఆకర్షించడానికి హేతుబద్ధంకాని క్రికెట్ సిద్ధాంతాలను ఆచరణలోకి తీసుకువస్తోందని, అంతటితో ఆగకుండా మా అందరికీ దేవుడివంటి సునీల్ గవాస్కర్ ను అవమానపరిచిందని వ్యాఖ్యానించాడు. రోజుకు లెక్కకు మించి వస్తున్న ఈ సందేశాలను చూస్తుంటే షారుఖ్ ఖాన్ ఒంటరివాడైపోయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే క్రికెట్ కు, నైట్ రైడర్స్ కు సంబంధించి అభిమానుల దృష్టిలో గంగూలీయే యువరాజు!
News Posted: 1 May, 2009
|