'భారత్ కూడా సురక్షితంకాదు'
దుబాయి: 2011 ప్రపంచ కప్ పోటీల నిర్వహణకు పాకిస్తాన్ సురక్షితమైన దేశం కాకపోతే, భారతదేశం కూడా కాదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ ఇటీవల ఇక్కడ జరిగిన ఐసిసి సమావేశంలో వాదించాడు. పాకిస్తాన్ లో ప్రపంచ కప్ పోటీల నిర్వహణకు భద్రతాపరమైన సందేహాలు ఐసిసికి ఉన్నట్టయితే, ఇండియా, బంగ్లాదేశ్ లలో కూడా పరిస్థితి అంత ప్రోత్సాహకరంగా లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరక్టర్ జనరల్ అయిన జావేద్ మియాందాద్, పాలకమండలి సభ్యుడు షకీల్ షేక్ ఐసిసి సమావేశంలో గట్టిగా వాదించారని సమావేశ వివరాలు తెలిసిన ఐసిసి అధికార వర్గాలు వెల్లడించాయి. 'భారతదేశంలో భద్రత పరిస్థితి ఇటీవలి కాలంలో ఏమాత్రం బాగులేదని వారు చెప్పారు. ముందుముందు మరింత దిగజారదన్న గ్యారంటీ కూడా లేదన్నారు. అలాగే బంగ్లాదేశ్ లో పరిస్థితి అనిశ్చితంగా ఉందని వాదించారు' అని ఆ వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో 2010 హాకీ ప్రపంచ కప్, కామన్వెల్త్ క్రీడోత్సవాల నిర్వహణపై కూడా మియాందాద్, షకీల్ సందేహాలు వ్యక్తంచేశారని తెలిసింది. పాకిస్తాన్ భద్రత పూర్తిగా కరవైనందువల్లనే చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్ క్రికెట్ పోటీలను అక్కడ నిర్వహించడం క్షేమం కాదని నిర్ణయించామని ఐసిసి అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్, సిఇఓ హరూన్ లోర్గాట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి బృందానికి స్పష్టంగా చెప్పారు. శ్రీలంక ట్టుపై దాడి జరిగిన తరువాత పాకిస్తాన్ లో క్రికెట్ ఆడడానికి ఎవరూ అంగీకరించడం లేదని పిసిబి అధ్యక్షుడు ఇజాజ్ భట్ సారథ్యంలోని ప్రతినిధివర్గానికి ఐసిసి ఉన్నతాధికారులు చెప్పారు.
News Posted: 1 May, 2009
|