అస్సీస్ సిరీస్ విజయం
దుబాయి: వన్డే ఇంటర్నేషనల్ పోటీ లో తొలిసారి ఐదు వికెట్లు తీసుకున్న డగ్ బోలింగర్, కెరీర్ లో నాలుగో వన్డే సెంచరీ చేసిన కెప్టెన్ మైకేల్ క్లార్క్ పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా వన్డే సిరీస్ విజయానికి కారకులయ్యారు. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఆస్ట్రేలియాకు శుక్రవారం విజయంతో 3-1 ఆధిక్యత లభించింది. కెరీర్ లో రెండో వన్డే మ్యాచ్ ఆడిన బోలింగర్ 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ 48.4 ఓవర్లలలో 197 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఆతరువాత అస్సీస్ కెప్టెన్ క్లార్క్(100 నాటౌట్)సెంచరీ చేయడంతో పాటు ఓపెనర్ షేన్ వాట్సన్(85 నాటౌట్)తో కలసి మూడో వికెట్ కు 197 పరుగులు జతచేయడంతో, ఇంకా 34 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించగలిగారు.
రికీ పాంటింగ్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన క్లార్క్ 14 ఫోర్లు కొట్టాడు. పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మొదటి ోవర్ రెండో బంతికే ోపెనర్ బ్రాడ్ హాడిన్ ను డకౌట్ చేసి, తరువాత తొలి వన్డే ఆడుతున్న మార్కస్ మార్త్ ను ఎల్.బి.డబ్ల్యూ చేయడంతో ఆస్ట్రేలియా మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు డగ్ బోలింగర్ తన మొదటి స్పెల్ లో సల్మాన్ బట్ ను, రెండో స్పెల్ లో షాహిద్ అఫ్రిది(40), షోయబ్ మాలిక్(27)లను ఔట్ చేశాడు. ఓపెనర్ అహ్మద్ షహజాద్ 43, మిస్బా ఉల్ హక్ 34 పరుగులు చేశారు. రెండు జట్ల మధ్య చివరి వన్డే అబూ ధాబిలో ఆదివారం జరుగుతుంది.
News Posted: 2 May, 2009
|