చెన్నై 'సూపర్' విజయం!
జోహాన్స్ బర్గ్: లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షదాబ్ జకాటి మాయాజాలంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతులు కట్టిపడేశాడు. ఐపిఎల్ రెండో సీజన్ లో శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టును ఓడించింది. వాండరర్స్ స్టేడియంలో అద్భుతమైన స్పిన్ బౌలింగ్ చేసిన ఇరవయ్యెనిమిదేళ్ల జకాటి 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో చెన్నై జట్టు 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవలసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్(51), దినేష్ కార్తిక్(52), దిల్షాన్ తిలకరత్నె(13), సంగ్వాన్(0)లను జకాటి ఔట్ చేశాడు.
గౌతమ్ గంభీర్ 13, డివిలియర్స్ 0, మన్హాస్ 0, భాటియా 2, మిశ్రా(నాటౌట్)11, నెహ్రా(నాటౌట్)0 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో త్యాగి 2, మోర్కెల్, మురళీథరన్ ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు చెన్నై జట్టు ఇన్నింగ్సులో మాథ్యూ హేడెన్ 19 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 30, సురేష్ రైనా 21 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 32, బద్రినాథ్ 34 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 45, విజయ్ 14, మోర్కెల్ 6, ధోని 6, జాకబ్ ఓరమ్ 3, జకాటి 13, బాలాజీ 2, మురళీథరన్(రనౌట్)3, త్యాగి(నాటౌట్)0 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో నాన్స్ 3, నెహ్రా 3, భాటియా 2, సంగ్వాన్ 1 వికెట్లు పడగొట్టారు.
News Posted: 3 May, 2009
|