ముంబై ఇండియన్స్ చిత్తు
జోహాన్స్ బర్గ్: జాక్స్ కాలిస్(నాటౌట్), రాబిన్ ఉతప్ప(నాటౌట్) అర్ధ సెంచరీల స్వైర విహారంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆదివారం ఐపిఎల్ రెండోసీజన్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కాలిస్ 59 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 69, ఉతప్ప 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేశారు. బెంగుళూరు జట్టు ఈ క్రమంలో ఓపెనర్ వసీం జాఫర్(7) వికెట్ మాత్రమే కోల్పోయి 150 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. జాఫర్ వికెట్ జహీర్ ఖాన్ కు లభించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టులో జయసూర్య(52-43 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్సర్), డానే బ్రేవో(నాటౌట్ 50-40 బంతులు,1 ఫోర్, 2 సిక్సర్లు) ప్రత్యర్ధి ఫీల్డర్లకు పని కల్పించారు. చివర్లో నాయర్(29)తప్ప మిగిలిన బ్యాట్స మెన్ గణనీయమైన స్కోర్లు సాధించ లేకపోవడంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయినా 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ టెండుల్కర్ 11, రహానె 0, డుమిని 1 పరుగులు చేశారు. బెంగులూరు బౌలర్లలో డిల్లాన్ ప్రీజ్(తొలి మ్యాచ్)3, వాన్ డెర్ మెర్వ్ 1 వికెట్లు పడగొట్టారు. జాక్స్ కాలిస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
News Posted: 3 May, 2009
|