దశ తిరగని కెకెఆర్
పోర్ట్ ఎలిజబెత్: ఐపిఎల్ రెండో సీజన్ లో ఆదివారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు, చివరి బంతి వరకూ పోరాడి, 6 వికెట్ల తేడాతో కోల్కటా నైట్ రైడర్స్(కెకెఆర్)పై విజయం సాధించింది. మహేల జయవర్దన(నాటౌట్)41 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. అజిత్ అగార్కర్ వేసిన చివరి ఓవర్ లో 7 పరుగులు సాధించవలసిన పంజాబ్ జట్టు బ్యాట్స్ మెన్ జయవర్దన ఒక ఫోర్ కొట్టగా మిగిలిన పరుగులు ఇర్ఫాన్ పఠాన్(నాటౌట్ 19)మిగిలిన మూడు పరుగులు సాధించాడు. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు ఇంతవరకూ 7 మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
పంజాబ్ జట్టు ఇన్నింగ్సులో సోహాల్ 25, సంగక్కర 0, కటీచ్ 34, యువరాజ్ 14 పరుగులు చేశారు. కోల్కటా బౌలర్లలో ఇషాంత్ 2, అగార్కర్ 1, హాడ్జ్ 1 వికెట్లు పడగొట్టారు. టోర్నమెంట్ ప్రారంభం నుండి సమస్యలతో సతమతమవుతున్న కోల్కటా జట్టు ఇంతవరకూ కోలుకో లేకపోయింది. మొత్తం ఆడిన 8 మ్యాచ్ ల్లో ఆరింటిలో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో అట్టడుగున వుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి 3 వికెట్లకు 153 పరుగుల భారీ స్కోరు సాధించగలిగినా, కోల్కటా జట్టును దురదృష్టం వెంటాడింది. మెకల్లమ్ 19, క్రిస్ గేల్ 17, హాడ్జ్(నాటౌట్) 70, గంగూలీ 22, వాన్ విక్(నాటౌట్) 18 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో చావ్లా 2, అబ్దుల్లా 1 వికెట్లు తీసుకున్నారు.
News Posted: 3 May, 2009
|