చెన్నై చేతిలో ఛార్జర్స్ చిత్తు
ఈస్ట్ లండన్: టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తో పాటు బౌలర్లు రెచ్చిపోవడంతో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహేద్ర సింగ్ ధోని(నాటౌట్ 58-37 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్సర్) చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ రెండో సీజన్ లో వరుసగా మూడో విజయం సాధించింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ డక్కన్ ఛార్జర్స్ ను 78 పరుగుల భారీ ఆధిక్యతతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, 178 పరుగులు సాధించింది. ఓపెనర్లు విజయ్(31), మాథ్యూ హేడెన్(43- 26 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పటిష్టమైన పునాది వేసిన తరువాత ధోని, సురేష్ రైనా(32-19 బంతులు, 1 ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఛార్జర్స్ బౌలర్లలో ఆర్పీ సింగ్, షోయబ్, టి సుమన్ ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు.
179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన డక్కన్ ఛార్జెర్స్ ఇన్నింగ్సులో కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్, అల్బీ మోర్కెల్ వేసిన మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తరువాత గిబ్స్, వివిఎస్ లక్ష్మణ్ కూడా డకౌట్ కావడంతో ఛార్జర్స్ జట్టు కేవలం ఒక్క పరుగుకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(21), డానే స్మిత్(49- 23 బంతులు, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కొద్దిసేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించినా కొత్త స్పిన్నర్ జకాటి ధాటికి నిలవలేక పోయారు. ఆ తరువాత సుమన్ 17, వేణుగోపాలరావు 2, హారిస్ 1, ఆర్పీ సింగ్ 2, షోయబ్ 1, ఓఝా 0 స్కోర్లతో ఒకరి వెంట ఒకరు పెవిలియన్ కు చేరుకోవడంతో ఛార్జర్స్ ఇన్నింగ్సు 100 పరుగులకే కుప్పకూలిపోయింది. సూపర్ కింగ్స్ బౌలర్లలో జకాటి 4, మోర్కెల్ 2, మురళీథరన్ 2, త్యాగి, రైనా ఒక్కొక్కటి వికెట్లు తీసుకున్నారు.
News Posted: 4 May, 2009
|