బుకానన్ కు కెకెఆర్ బైబై?
డర్బాన్: ఐపిఎల్ రెండో సీజన్ లో పరాజయ పరంపరలో కొట్టుమిట్టాడుతున్న కోల్కటా నైట్ రైడర్స్(కెకెఆర్) జట్టు వివాదాస్పద కోచ్ జాన్ బుకానన్ కు ఉద్వాసన చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. బాలివుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కెకెఆర్ జట్టు ఈ యేడాది ఐపిఎల్ టోర్నీలో ఇంతవరకూ ఒక్కటి మినహా(అది కూడా డక్ వర్త్-లూయీస్ పుణ్యమా అని) అన్ని మ్యాచ్ లలో ఓడిపోయినందుకు, ఆస్ట్రేలియాకు చెందిన తమ కోచ్ బుకానన్ కు గుడ్ బై చెప్పనుందని ప్రముఖ భారతీయ వార్తా చానెల్ పేర్కొంది.
ఐపిఎల్ టోర్నీలో కెకెఆర్ ఇంతవరకూ 9 మ్యాచ్ లు ఆడగా, ఒకటి గెలుపొంది, ఒకటి డ్రా చేసుకుని, ఏడింటిలో పరాజయం పాలయింది. పాయింట్ల పట్టికలో మూడు పాయింట్లతో అట్టడుగు స్థానంలో వుంది. పోటీలు ప్రారంభంకాక ముందే కెకెఆర్ కోచ్ జాన్ బుకానన్ 'బహుళ కెప్టెన్' విధానం ప్రతిపాదించి, సౌరవ్ గంగూలీని కెప్టెన్ పదవి నుంచి తప్పించి, కివీ వికెట్ కీపర్ బ్రెండన్ మెకల్లమ్ కు ఆ పదవి కట్టబెట్టి అనేక వాగ్వివాదాలకు, విభేదాలకు తెర తీశాడు. టోర్నమెంట్ ప్రారంభమయ్యాక కెకెఆర్ జట్టు వైఫల్యాలకు ప్రధాన కారణం కోచ్ బుకానన్, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న కెప్టెన్ మెకల్లమ్ లేనని అందరూ వేలెత్తి చూపుతున్నారు.
News Posted: 6 May, 2009
|