సత్తా చాటిన చాలెంజర్స్
సెంచురియన్: వరస పరాజయాలతో కుంగిపోయిన కోలకత్తా నైట్ రైడర్స్ జట్టుకు తాజాగా బెంగళూరు చేతిలోనూ చేదు మాత్రే. టేలర్ చాలెంజ్‌కు తలవంచడం తప్ప చేయగల్గిందేమీ లేకపోయింది. భారీ స్కోరు చేసినా పరాభవం తప్పలేదు. భారీ స్కోరుతో గెలుద్దామని మెక్కుల్లమ్ బ్యాట్ ఝళిపిస్తే... అవతలి వైపునుంచి రాస్ టేలర్ 81 (7్ఠ6, 5్ఠ4) అజేయంగా విజృంభించాడు. కాదు..కాదు.. వీరవిహారం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరుకు సెమీస్ అవకాశాల్ని మెరుగుపరిచాడు. మంచి నీళ్ల ప్రాయంగా సిక్సర్లను బాదేశాడు. అన్నీ భారీ సిక్సర్లే. ప్రేక్షకుల గ్యాలరీని సైతం అధిగమించిన సిక్సర్లే అంటే అతిశయోక్తి కాదేమో! అంతకుముందు కోల్‌కతా కెప్టెన్ మెక్కుల్లమ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 173/4 స్కోరు చేసింది. మెక్కుల్లమ్(84)తో పాటు హస్సీ(43) రాణించాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన బెంగళూరు మరో 4 బంతులు మిగిలుండగానే (176/4) విజయభేరి మోగించింది. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
బెంగళూరు లక్ష్యం 174. ఓవర్‌కు సుమారు 9 పరుగులకు తక్కువ కాకుండా బాదాల్సిందే. ఈ క్రమంలో తొలుత ఓపెనర్లు రైడర్(22), కలీస్(32) చక్కని శుభారంభమిచ్చారు. తొలివికెట్‌కు 58 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ విఫలమయ్యారు. ఆంతే ఆందోళన మొదలైంది. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప(7), ద్రవిడ్ (12) కూడా చేతులెత్తేశారు. ఆ ఆందోళన కాస్త రెట్టింపైంది. కానీ మరోవైపు క్రీజ్‌లోకి దిగినప్పటి నుంచి రాస్ టేలర్ భారీ షాట్లతో విరుచుకు పడుతూనే ఉన్నాడు. 24 బంతుల్లో (5్ఠ4, 2్ఠ6) అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత సిక్సర్లే... సిక్సర్లు..! మలి సంధ్యలో చుక్కలు చూపాడు. ద్రవిడ్‌తో నాలుగు ఓవర్లలో 48 పరుగులు జోడించిన టేలర్, ఐదో వికెట్‌కు బౌచర్‌తో కలిసి అజేయంగా 54 పరుగులు జతచేశాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో సెమీస్ బెంగ తీర్చే విజయాన్ని జట్టుకు అందించాడు. 19.2 ఓవర్లలోనే బెంగళూరు 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
టాస్ నెగ్గిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గంగూలీతో మెక్కుల్లమ్ కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మెక్కుల్లమ్ ఆరంభంలో తడబడినా తర్వాత బౌండరీలతో నిలబడ్డాడు. ఏకంగా పది ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 84 పరుగులు చేసి తుదికంటా అజేయంగా నిలిచాడు. తొలుత ఓపెనర్ గంగూలీ(4), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ అరిందం ఘోష్(7) విఫలమైనా... నింపాదిగా ఆడాడు. వాళ్లిద్దరినీ వినయ్‌కుమార్ బోల్తా కొట్టించాడు. హస్సీ రాకతో స్కోరువేగం కాస్త పెరిగింది. ఇద్దరూ జట్టు స్కోరును వంద పరుగుల సమీపానికి చేర్చారు. సరిగ్గా 91 పరుగుల వద్ద హస్సీ(43) వికెట్‌ను అఖిల్ నేలకూల్చాడు. తర్వాత మ్యాథ్యూస్, మెక్కుల్లమ్‌కు జతయ్యాడు. మెక్కుల్లమ్48 బంతుల్లో (5్ఠ4, 2్ఠ6అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక చివరి ఓవర్లలో రెచ్చిపోయాడు. బౌండరీలతో స్కోరుబోర్డును వేగంగా పరుగెత్తించాడు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. మెక్కుల్లమ్(84)తో పాటు సాహ (10) అజేయంగా నిలిచాడు.
News Posted: 12 May, 2009
|