ఐపిఎల్ సెమీస్ లో చార్జర్స్
డర్బన్ : డక్కన్ చార్జర్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండవ సీజన్ లో సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. గురువారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సిబి)తో తమ చివరి లీగ్ గేమ్ ఫలితంతో నిమిత్తం లేకుండానే డక్కన్ చార్జర్స్ జట్టుకు సెమీస్ కు అర్హత లభించింది. చార్జర్స్ సెమీస్ ప్రవేశానికి ముప్పు తేగల రెండు జట్లు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బుధవారం పోటీలలో ఓడిపోయాయి. రాయల్స్ జట్టును కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్), కింగ్స్ ఎలెవెన్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్ కె) ఓడించాయి.
బుధవారం ఉదయానికి ఢిల్లీ డేర్ డెవిల్స్ (డిడి), చెన్నై సూపర్ కింగ్స్ జట్లు సెమీస్ లో ప్రవేశాన్ని ఖాయం చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాలకు నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. చార్జర్స్ జట్టు 14 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో ఉన్నది. 13 మ్యాచ్ లలో ఏడు విజయాలతో ప్లస్ 27 భారీ నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర్) వల్ల చార్జర్స్ కు ఈ స్థానం లభించింది. రన్ రేట్ కారణంగానే రాయల్ చాలెంజర్స్ (ఎన్ఆర్ఆర్ మైనస్0.25), కింగ్స్ ఎలెవెన్ (మైనస్ 0.48) జట్లు రెండూ 14 పాయింట్లతో ఉన్నప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ (13 పాయింట్లు) కన్నా చార్జర్స్ ముందంజలో ఉంది.
రాజస్థాన్, పంజాబ్ జట్లలో ఏ ఒక్కటైనా లేదా రెండూ బుధవారం గెలిచి ఉన్నట్లయితే చార్జర్స్ జట్టు తమ చివరి లీగ్ పోటీలో తప్పకుండా విజయం సాధించవలసి వచ్చేది. కాని అలా జరగలేదు. నిరుటి చాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవలసి వచ్చింది.
అయితే, పంజాబ్ జట్టుకు ఇప్పటికీ సెమీస్ కు చేరేందుకు ఒక అవకాశం లేకపోలేదు. రాయల్ చాలెంజర్స్ జట్టు భారీ తేడాతో ఓడిపోయిన పక్షంలో రన్ రేట్ ఆధారంగా పంజాబ్ జట్టు సెమీస్ కు అర్హత పొందవగలదు. కాని ఈ దశలో అది అసాధ్యంగా కనిపిస్తున్నది. రన్ రేట్ ఆధిక్యం విషయంలో చార్జర్స్ జట్టు పంజాబ్ జట్టు కన్నా బాగా ముందంజలో ఉన్నది.
కాగా సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించిన నాలుగు జట్లకూ దక్షిణ భారతీయులే యజమానులుగా ఉన్నారు. డక్కన్ చార్జర్స్ జట్టుకు యజమాని 'డక్కన్ క్రానికల్' పత్రికల గ్రూప్ చైర్మన్ టి. వెంకట్రామ్ రెడ్డి కాగా, రాష్ట్రానికి చెందిన జి. మల్లికార్జున రావు ఆధ్వర్యంలోని జిఎంఆర్ గ్రూప్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కు యజమాని. చెన్నైకి చెందిన ఎన్. శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యజమాని కాగా మద్యం, విమాన సంస్థల అధిపతి విజయ్ మాల్యా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు యజమాని.
News Posted: 21 May, 2009
|