వీరూని పట్టించుకోని ధోని!
లండన్ : సందు దొరికితే ఠలాయించే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు టీమ్ ఇండియా సారథి మహేంద్ర సింగ్ ధోని పరోక్షంగా ఒక హెచ్చరిక చేశాడు. మనసులోని మాటను బయటపెట్టేందుకు ఏమాత్రం సంకోచించని ధోని జట్టుకు రోహిత్ శర్మ రూపంలో కొత్త ఓపెనర్ లభించాడని ప్రకటించడం ద్వారా సెహ్వాగ్ కు ఈ హెచ్చరిక చేశాడు.
సోమవారం లండన్ లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వామప్ మ్యాచ్ లో దక్కన్ చార్జర్స్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ 20 బంతులలో 36 పరుగుల స్కోరుతో ఇండియాకు గొప్ప ప్రారంభం ఇచ్చిన తరువాత అతనిని ఓపెనర్ గా కొనసాగించాలనే ఆలోచనలో కెప్టెన్ ఉన్నాడు. భుజం నొప్పి కారణంగా సెహ్వాగ్ పక్కకు తప్పుకున్నందున రోహిత్ శర్మ జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు.
'రోహిత్ ఆడిన తీరుకు నేను ముగ్ధుడినయ్యాను. అతను అద్భుతంగా బ్యాట్ చేశాడు' అని ధోని చెప్పాడు. మరి ఓపెనర్ గా వచ్చే అభ్యర్థుల గురించిన ప్రశ్నకు కెప్టెన్ సమాధానం ఇస్తూ, 'మేము రోహిత్ ను ఆడించవచ్చునని నా ఆలోచన. బ్యాటింగ్ శ్రేణిలో అతనిని మేము ముందుకు పంపడానికి అదొక కారణం. రోహిత్ కనబరుస్తున్న ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే అతనితో ఓపెనర్ గా బ్యాట్ చేయించాలని అనుకుంటున్నాను' అని చెప్పాడు.
ఓపెనర్లుగా దింపేందుకు ధోని దృష్టిలో మరి కొందరు కూడా ఉన్నారు. వారిలో సెహ్వాగ్ లేడు. 'రోహిత్ కాకుండా మాకు యూసుఫ్ పఠాన్ ఉన్నాడు. యూసుఫ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించగలడు. అతను దేశీయ పోటీలలో ఓపెనర్ గా ఆడాడు. రవీంద్ర జడేజాను కూడా ఆడించవచ్చు. మాకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి' అని కెప్టెన్ చెప్పాడు.
వామప్ మ్యాచ్ పట్ల ఇండియా విధానం గురించి ధోని మాట్లాడుతూ, 'తమ ఆటను అసలు మార్చుకోని వీరేంద్ర సెహ్వాగ్ వంటి బ్యాట్స్ మన్ లు కొందరు ఉన్నారు. అతను తన ధోరణిలోనే బ్యాట్ చేస్తాడంతే' అని అన్నాడు. మరి సెహ్వాగ్ తీరును ధోని ఆవిధంగా ఆక్షేపించాడా?
ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు సెహ్వాగ్, ధోని మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిందంటూ ధ్రువీకరణ కాని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సెహ్వాగ్ ఆడాలని ధోని కోరాడని, కాని నొప్పి పెడుతున్న తన భుజానికి మరి కొంత విశ్రాంతి ఇవ్వాలని సెహ్వాగ్ అనుకున్నాడని తెలుస్తున్నది. వాస్తవానికి వారిద్దరూ గొప్ప స్నేహితులు కారు.
News Posted: 3 June, 2009
|