హాకీ ఇండియా
న్యూఢిల్లీ : దేశంలో హాకీ వ్యవహారాలను చూసేందుకు కొత్త జాతీయ హాకీ సంఘాన్ని ఏర్పాటు చేస్తుట్టు భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య హెచ్చరికల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. హాకీకి ఒక సమాఖ్య లేకపోతే అంతర్జాతీయ ఈవెంట్స్ లో పాల్గొనే హక్కు కోల్పోతుందని అంతర్జాతీయ సమాఖ్య మే 5న ఒక లేఖలో హెచ్చరించిన నేపథ్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. పురుషుల, మహిళల హాకీ సంఘాలకు కలిపి హాకీ ఇండియాను ఏర్పాటు చేయడానికి మే 20న నిర్ణయించామని, దాన్ని ఇప్పుడు లాంఛనంగా ప్రారంభించామని ఐఓఏ అధ్యక్షుడు సురేష్ కల్మాడి తెలిపారు.
దేశంలో రెండు హాకీ సమాఖ్యలుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన అంతర్జాతీయ సమాఖ్య 15 రోజుల్లో దీనిపై తుది గడువు తీసుకోవాలని పేర్కొంది. అలా లేనట్లయితే వచ్చే సంవత్సరం ప్రపంచకప్ ను నిర్వహించే అవకాశం కోల్పోవడంతోపాటు అంతర్జాతీయ సమాఖ్య సమావేశాల్లో పాల్గొనే వీలు కూడా పోతుందని స్పష్టం చేసింది. కాగా ఐఓఏ జాయింట్ సెక్రటరీ హరీశ్ శర్మ నేతృత్వంలో 9 మంది సభ్యుల కమిటీతో హాకీ ఇండియాను ఏర్పాటు చేశామనీ, వీరికి హాకీ విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించామని కల్మాడి చెప్పారు. ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అభినందించినట్టు తెలిపారు.
News Posted: 4 June, 2009
|