భారత్ పై భారీ అంచనాలు
లండన్ : రెండు సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ట్వంటీ 20 ప్రపంచకప్ తర్వాత వచ్చిన సత్వర ఫలితం ఐపిఎల్. ఆ టోర్నమెంట్ ఫైనల్ లో ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఓడించి మొట్టమొదటి ట్వంటీ 20 కప్ ను అందుకుని వచ్చి అభిమానుల్లో ఆనందం నింపింది. ఒక ప్రపంచకప్ గెలవాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దేశంలో ధోనీసేన అనూహ్యంగా ఈ కప్ ను అందించింది. అదే వన్డే కప్ ను తీసుకుంటే కపిల్ దేవ్ నాయకత్వంలో విజయం అందుకున్న తర్వాత మళ్లీ భారత్ కు అలాంటి విజయం అందలేదు. 2007లో ఆ లోటును భారత జట్టు కొంతవరకు భర్తీ చేసింది. ఇప్పుడు మరోసారి హాట్ ఫేవరైట్ గా డిఫెండింగ్ చాంపియన్ గా ఈ ద్వితీయ టోర్నమెంట్ కు సన్నద్దమైంది. ఈ క్రమంలో ఇండియా తన తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్, ఆపై ఐర్లాండ్ తో ఆడుతున్నది. ఈ రెండింటిలో ఒక మ్యాచ్ గెలుచుకుంటే సూపర్ 8 కు చేరుతుంది. సూపర్ 8లో మూడు మ్యాచ్ ల్లో కనీసం రెండుగెలిచినా సెమీస్ చేరుతుంది. 16 రోజులపాట జరిగే ఈ టోర్నమెంట్ శుక్రవారం నాడు ఆతిథ్యజట్టు ఇంగ్లాండ్ - నెదర్లాండ్స్ తో తలపడే మ్యాచ్ తో మొదలవుతుండగా ఏబిసిడి నాలుగు గ్రూపుల్లో 12 జట్లు తలపడుతున్నాయి. ఒక్కో గ్రూపునుంచి రెండు జట్లు సూపర్ 8కు చేరతాయి. ధోనీ నాయకత్వంలో హిట్టర్స్, పటిష్టమైన బౌలింగ్ విభాగం ఈ టోర్నమెంట్ లో పోరాడేందుకు సన్నద్ధమైంది. రెగ్యులర్ గా అంతర్జాతీయ టోర్నమెంట్ లు ఆడే 9 జట్లతో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లలో అర్హత పొంది ఆడుతున్నాయి. ప్రధానంగా పోటీ ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ల మధ్యనే ఉంటుంది. ఆ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్ లదే.
News Posted: 4 June, 2009
|