ఇండియాయే ఫేవరైట్
పుణె : శుక్రవారం ఇంగ్లండ్ లో ప్రారంభమైన ప్రపంచ కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్ విజేత ఇండియా కాగలదని అత్యధిక సంఖ్యాకులు పందెం కాస్తున్నారు. ఈ విషయంలో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో ఉన్నది. స్పోర్టింగ్ బెట్ సంస్థ వద్ద ధోని జట్టుపై పందెం 3/1గా ఉంది. ఆతరువాతి స్థానాలలో దక్షిణాఫ్రికా 100/30తోను, ఆస్ట్రేలియా 9/2తోను ఉన్నాయి. అయితే, లాడ్ బ్రోక్స్ సంస్థ 3/1తో ఇండియా, దక్షిణాఫ్రికా రెండింటినీ ఫేవరైట్లుగా పేర్కొన్నది. ఆస్ట్రేలియా 5/1తో మూడవ స్థానంలో ఉన్నది.
అయితే, ఇండియాలో పంటర్లు మాత్రమే స్వదేశం జట్టు కన్నా ఆస్ట్రేలియాపైనే మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి ఫేవరైట్ల జాబితాలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ కూడా ఇండియా కన్నా ముందు స్థానాలలో ఉన్నాయి. ఇండియాలో ఆస్ట్రేలియా టోర్నమెంట్ ను గెలుస్తుందనేవారు 10/3 పందెం కాస్తున్నారు. దక్షిణాఫ్రికాపైన 10/4 మేరకు, న్యూజిలాండ్ పైన 10/6 మేరకు పందెం కాస్తున్నారు. ఇండియా 10/8తో నాలుగవ స్థానంలో ఉన్నది.
మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని భారత జట్టును స్థానిక పంటర్లు ఫేవరైట్లుగా పేర్కొనకపోవడానికి కారణాన్ని ఒక బుకీ వివరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించిన సమయమే ఇందుకు కారణమని ఆ బుకీ పేర్కొన్నారు. 'ఐపిఎల్ నిర్వహణకు అది సరైన సమయం కాదు' అని తన పేరు వెల్లడికి ఇష్టపడని ఆ బుకీ చెప్పారు. తాను భారతీయ చట్టం ప్రకారం ఒక నేరస్థుడిని కనుక తన పేరు వెల్లడి చేయవద్దని ఆయన కోరారు. 'టోర్నమెంట్ నిడివి కారణంగా ఇండియా బెట్టింగ్ మార్కెట్ లో వెనుకబడింది' అని ఆ బుకీ చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ జట్టులో లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ ను గెలుచుకునే అవకాశాలకు తీవ్ర స్థాయిలో విఘాతం కలిగింది. ఆసీస్ జట్టుపై పందెం స్థాయి కూడా 4/1 నుంచి 5/1కి మారింది. వేర్వేరు మ్యాచ్ లపై పందెం కాయడంతో పాటు టాస్, అత్యధికంగా పరుగులు స్కోరు చేసే బ్యాట్స్ మన్, అత్యధికంగా వికెట్లు తీసుకునే బౌలర్ వంటి అంశాలపై కూడా పందాలు కాస్తున్నారు. లార్డ్స్ మైదానంలో పెవిలియన్ మీదుగా బంతిని కొట్టగల బ్యాట్స్ మన్ పై కూడా పందాలు కాస్తున్నారు. ఈ విషయంలో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ఫేవరైట్ కాగా వీరేంద్ర సెహ్వాగ్ రెండవ స్థానంలో ఉన్నాడు.
News Posted: 6 June, 2009
|