ఇంగ్లండ్ కు డచ్ షాక్
లండన్ : ప్రపంచ కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ లోనే ఆతిథేయ జట్టు ఇంగ్లండ్ అనూహ్యంగా ఓడిపోయింది. శుక్రవారం లండన్ లార్డ్స్ మైదానంలో జరిగిన పోటీలో ఇంగ్లండ్ జట్టుపై నెదర్లాండ్స్ (డచ్) జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ముందు బ్యాట్ చేసిన ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి చేసిన 162 పరుగులు చేయగా నెదర్లాండ్స్ జట్టుకు మ్యాచ్ చివరి బంతితో విజయం లభించింది. గెలవడానికి చివరి బంతికి రెండు పరుగులు చేయవలసి ఉన్న డచ్ జట్టుకు ఓవర్ త్రోతో ఆ పరుగులు లభించాయి.
నెదర్లాండ్స్ క్రీడాకారులు ఎంతో స్ఫూర్తితో బ్యాట్ చేయగా ఇంగ్లండ్ క్రీడాకారులు ఫీల్డ్ లో తత్తరపాటుకు గురయ్యారు. అనేక రనౌట్ అవకాశాలను జారవిడుచుకున్నారు. మ్యాచ్ కు ముందు సన్నటి జల్లులు పడడంతో మైదానం కూడా చిత్తడిగా మారింది. స్టువార్ట్ బ్రాడ్ వేసిన చివరి ఓవర్ లో డచ్ జట్టుకు ఏడు పరుగులు, ఆఖరి బంతికి రెండు పరుగులు కావలసి ఉన్నాయి. ఎడ్గార్ షైఫెర్లి చివరి బంతిని కొట్టినప్పడు అది బౌలర్ వైపే వెళ్ళినప్పటికీ ఒక పరుగుకు ప్రయత్నించాడు. బ్రాడ్ బంతిని అందుకుని బౌలర్ వైపు స్టంపులపైకి విసిరాడు. కాని బంతి స్టంపులకు తగలలేదు. బ్యాట్స్ మన్ లు వేగంగా రెండు పరుగులు పూర్తి చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టామ్ డి గ్రూత్ తమ నెదర్లాండ్స్ జట్టు పరుగుల చేజ్ కు సారథ్యం వహించాడు. అతను కేవలం 30 బంతులు ఎదుర్కొని 49 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఆరు బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతనికి రైయాన్ టెన్ డోషేట్ అండగా నిలిచాడు. డోషేట్ 17 బంతులలో రెండు బౌండరీలతో పాటు 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్ క్రీడాకారులు మొత్తం నాలుగు సిక్సర్లు కొట్టగా, ఇంగ్లండ్ జట్టులో ఒక్కరు కూడా సిక్సర్ కొట్టలేకపోయారు.
అంతకుముందు ల్యూక్ రైట్ ధాటీగా బ్యాట్ చేసి 71 పరుగులు చేశాడు. రైట్ ఓపెనర్ రవి బొపారాతో కలసి మొదటి వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బొపారా 46 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టు చివరి ఐదు ఓవర్లలో 38 పరుగులు మాత్రమే స్కోరు చేసింది. మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ గాయం కారణంగా ఇంగ్లండ్ తరఫున ఈ పోటీలో ఆడలేకపోయాడు.
సంక్షిప్తంగా స్కోర్లు: ఇంగ్లండ్ - 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 (రవి బొపారా 46, ల్యూక్ రైట్ 71, ఆర్ టెన్ డోషేట్ 35 పరుగులకు 2 వికెట్లు). నెదర్లాండ్స్ - 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 (డి రీకర్స్ 20, టిఎన్ డి గ్రూత్ 49, పి బొర్రెన్ 30, ఆర్ టెన్ డోషేట్ 22 నాటౌట్, జె ఆండర్సన్ 23 పరుగులకు 3 వికెట్లు).
News Posted: 6 June, 2009
|