బంగ్లాపై భారత్ గెలుపు
నాటింగ్ హామ్ : ఐసిసి ప్రపంచ టి20 క్రికెట్ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు సంచలన ఫలితాలు (అప్ సెట్ లు) నమోదు కావడంతో వర్తమాన చాంపియన్ భారత జట్టు శనివారం పక్కా వ్యూహంతో బంగ్లాదేశ్ ను 25 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 2007లో వెస్టిండీస్ లో 50 ఓవర్ల ప్రపంచ కప్ లో టీమ్ ఇండియాపై సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్ నాటింగ్ హామ్ ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో మరొకసారి అటువంటి గెలుపు కోసం పెట్టుకున్న ఆశలు శనివారం అడియాసలయ్యాయి. టాస్ గెలిచి ముందు బ్యాట్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు స్కోరు చేయగా బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలన్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం సరైనదేనని ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా నిరూపించాడు. ఓఝా తన నాలుగు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అతను ఒక క్యాచ్ కూడా చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అతనికే ప్రకటించారు. బంగ్లాదేశ్ జట్టు ఓపెనర్ జునైద్ సిద్దికి కేవలం 22 బంతులు ఎదుర్కొని 41 పరుగులు స్కోర్ చేశాడు. కాని మిగిలిన బ్యాట్స్ మన్ లు విఫలురయ్యారు.
అంతకుముందు భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఒక వైపు నిలదొక్కుకుపోయి పటిష్ఠమైన హాఫ్ సెంచరీ స్కోరు చేయగా యువరాజ్ సింగ్ చివరి ఓవర్లలో శక్తిమంతమైన కొన్ని షాట్లతో జట్టు ఇన్నింగ్స్ కు తుదిమెరుగులు దిద్దాడు. ఫలితంగా ఇండియా పటిష్ఠమైన స్కోరు చేయగలిగింది. గంభీర్ 46 బంతులు ఎదుర్కొని 50 పరుగులు చేసి గట్టి పునాది వేయగా యువరాజ్ కేవలం 18 బంతులలో 41 పరుగులు స్కోర్ చేశాడు. అతని స్కోరులో నాలుగు సిక్సర్లు, మూడు బౌండరీలు ఉన్నాయి. మరొక ఓపెనర్ రోహిత్ శర్మ 23 బంతులలో 36 పరుగులు చేశాడు. అతని స్కోరులో మూడు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. రోహిత్, గంభీర్ జతగా మొదటి వికెట్ కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ ధోని 26 పరుగులకు అవుటయ్యాడు. భారత జట్టు తమ తదుపరి పోటీని ఈ నెల 10న ఐర్లాండ్ జట్టుతో ఆడుతుంది.
సంక్షిప్తంగా స్కోర్లు: ఇండియా - 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 (గౌతమ్ గంభీర్ 50, రోహిత్ శర్మ 36, మహేంద్ర సింగ్ ధోని 26, యువరాజ్ సింగ్ 41, ఎన్ ఇస్లామ్ 32 పరుగులకు 2 వికెట్లు). బంగ్లాదేశ్ - 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 (జునైద్ సిద్దికి 41, ఎన్ ఇస్లామ్ 28, ప్రజ్ఞాన్ ఓఝా 21 పరుగులకు 4 వికెట్లు, ఇశాంత్ శర్మ 34 పరుగులకు 2 వికెట్లు).
శనివారం జరిగిన మరి రెండు మ్యాచ్ లలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో స్కాట్లండ్ జట్టును ఓడించగా వెస్టిండీస్ కూడా ఏడు వికెట్ల తేడాతోనే ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
News Posted: 7 June, 2009
|