కప్పు గెలిస్తే అద్భుతమే
లండన్ : ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ20 టోర్నీలో ఇండియా నిజంగా తన టైటిల్ ను నిలబెట్టుకుంటే అద్భుతమే అవుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ట్వంటీ20 లో ఉన్న అనిశ్చిత దృష్ట్యా ఐసిసి ప్రపంచ ట్వంటీ20 చాంపియన్ షిప్ టైటిల్ ను భారత జట్టు నిలబెట్టుకుంటే అంతకన్నా అద్భుతం ఏదీ ఉండదని భారత జట్టు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అన్నారు. ఇది ఇలా ఉండగా, వర్తమాన చాంపియన్లు ఇండియాపై అనుసరించవలసిన వ్యూహాన్ని రూపొందించుకోవడంలో ప్రత్యర్థి జట్లు నిమగ్నమయ్యాయి. ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ20 టోర్నీలో సూపర్ ఎయిట్ పోటీలు ఈ వారం ద్వియార్థంలో మొదలు కానున్నాయి. ఇండియా దాదాపు రెండవ రౌండ్ కు చేరుకున్నది. తన తదుపరి పోటీలలో ఇండియా ఈనెల 12న ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లలో ఒక జట్టుతోనూ, 14న ఇంగ్లండ్ తోనూ, 16న దక్షిణాఫ్రికాతోనూ ఆడవచ్చు.
అయితే, ట్వంటీ20 తరహా క్రికెట్ లో ఉన్న అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుంటే ఇండియాను కొంతవరకు ఫేవరైట్లుగా మాత్రమే పేర్కొనవచ్చనని భారత వెటరన్ సునీల్ గవాస్కర్ అన్నారు. ఇక ఇండియా సారథి మహేంద్ర సింగ్ ధోని జట్టు బలహీనతలు ఏమిటో వెల్లడించడం ద్వారా ప్రత్యర్థి జట్లకు ఉత్సాహం కలిగించాడు. అందువల్ల ఆ జట్లు భారత బలహీనతలను అవకాశంగా తీసుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నించవచ్చు. తన బౌలర్లు మొదటి ఆరు ఓవర్లలోనూ, చివరి రెండు మూడు ఓవర్లలోనూ బౌల్ చేస్తున్న తీరు పట్ల ధోని ఆందోళన వెలిబుచ్చాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఆ జట్టు మొదటి ఓవర్లలో 50 పరుగులుస్కోరు చేసింది. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో ఐదు బంతులలో మూడు సిక్సర్లను బంగ్లా క్రికెటర్లు కొట్టారు. పేలవమైన ప్రారంభం, దారుణమైన ముగింపు ఉంటున్నప్పటికీ మధ్య ఓవర్లలో మాత్రం భారత బౌలర్లు ప్రత్యర్థి జట్లపై పట్టు బిగించడం కొంతలో కొంత ఊరట కలిగిస్తున్నది. ఏడవ, 16వ ఓవర్ల మధ్య తన ప్రధాన బౌలర్లు పేసర్ ఇశాంత్ శర్మ, స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓఝూలను ధోని రంగంలోకి దింపుతున్నాడు. వారు ముగ్గురూ ఎనిమిది బంగ్లా వికెట్లలో ఆరింటిని తీసుకున్నారు. తమ కోటా నాలుగు ఓవర్లను పూర్తి చేసిన బౌలర్లు ఆ ముగ్గురే. అత్యంత ప్రతిభావంతులైన ఆ ముగ్గురివల్లే బంగ్లాదేశ్ మ్యాచ్ ను ఓడిపోయింది.
ధోని అనుసరిస్తున్న మరొక పద్దది కూడా ఇతర జట్ల వ్యూహకర్తల దృష్టిలో పడి ఉండవచ్చు. మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడానికి ధోని ఇష్టపడడం లేదు. ఆ సమయంలో స్కోరు నత్త నడకన సాగినప్పటికీ అతను బాధపడడం లేదు. అందువల్లే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గౌతమ్ గంభీర్, ధోని ఆ వ్యవధిలో మరీ సాంప్రదాయకంగా ఆడారు. 16 ఓవర్లలో జట్టు కేవలం 121 పరుగులు స్కోరు చేయగలిగింది. అయితే, రెండు వికెట్లు మాత్రమే కోల్పోయినందున యువరాజ్ సింగ్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, ఇర్ఫన్ పఠాన్ వంటి భారీ హిట్టర్లు స్వైర విహారం సాధించగలిగారు. దానితో 20 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 5 వికెట్లకు 180 పరుగులు చేయగలిగింది. టోర్నమెంట్ ముందుకు సాగినప్పుడు ప్రత్యర్థి జట్లు ఈ భారత వ్యూహాన్ని తిప్పికొట్టడానికి పథక రచన చేయవచ్చు.
News Posted: 9 June, 2009
|