లంక చేతిలో పాక్ ఓటమి
లండన్: ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంక 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధిం చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లం 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జవాబుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బౌలర్లు ఆధిప త్యం కనబరిచిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 151 పరుగుల లక్ష్యాన్ని కూడా అధిగమించలేక పోయింది. యూనిస్‌ఖాన్(50) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేక పోయాడు. లంక వెటరన్ స్పిన్నర్ వరుస బంతుల్లో మిస్బా, ఆఫ్రిదిలను పెవిలియన్ పంపించి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
కష్టసాధ్యం కానీ లక్ష్యంతో చేపట్టిన పాకిస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బట్(0)ను మాథ్యూస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అక్మల్‌తో కలిసి షోయబ్ మాలిక్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచేందుకు ప్రయత్నించాడు. ధాటిగా ఆడిన మాలిక్ 20 బంతుల్లోనే 5ఫోర్లతో 28 పరుగులు చేశాడు. అయితే మలింగ అతన్ని ఔట్ చేసి పాక్‌ను మళ్లీ కష్టాల్లోకి నెట్టాడు. రెండు బంతుల తర్వాత అక్మల్ కూడా వెనుదిరిగాడు. దీంతో పాకిస్థాన్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
అయితే మిస్బాతో కలిసి యూనిస్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. మిస్బా నెమ్మదిగా ఆడగా యూనిస్ వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు కొట్టాడు. వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా కనిపిస్తున్న దశలో మురళీధరన్ వరుస బంతుల్లో మిస్బా(20), ఆఫ్రిది(0) వికెట్లను పడగొట్టి పాకిస్థాన్ ఓటమిని ఖాయం చేశాడు. యూనిస్ 30 బంతుల్లో 5ఫోర్లతో 50 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది. లంక జట్టులో మలింగ మూడు, మురళీ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక 150 పరుగులు చేసింది. దిల్షాన్ (46), జయసూర్య(26) మరోసారి రాణించారు. ప్రారంభంలో ధాటి గా ఆడిన లంకను చివర్లో పాక్ బౌలర్లు కట్టడి చేశారు. ఉమర్, ఆఫ్రిది, అజ్మల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 150/7 (దిల్షాన్ 46, జయసూర్య 26, జయవర్ధనే 19, ఆఫ్రిది 2/23, అజ్మల్ 2/23)
పాకిస్థాన్: 20 ఓవర్లలో 131/9 (యూనిస్‌ఖాన్ 50, మాలిక్ 28, మిస్బా 21, మలింగ 3/17, మురళీధరన్ 2/28).
News Posted: 13 June, 2009
|