విండీస్ పై సౌథాఫ్రికా గెలుపు
ది ఓవల్: ట్వంటీ-20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు ఎదురేలేకుండా పోయింది. సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికికి 163 పరుగులు మాత్రమే చేసింది. ఫాస్ట్‌బౌలర్ పార్నెల్ అద్భుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను గెలిపిం చాడు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫ్లెచర్(0) ఖాతా తెరువకుండానే పెవిలియన్ చేరాడు. పార్నెల్ అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. గేల్(5) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా పార్నెల్‌కే దక్కింది.
ఒకవైపు వికెట్లు పడిపోతున్న యువ ఆటగాడు సిమన్స్ ఒంటరి పోరాటం చేశాడు. బ్రేవోతో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించి ఆశలు చిగురింప చేశారు. అయితే 19 పరుగులు చేసిన బ్రేవోను వండర్‌మర్వ్ ఔట్ చేశాడు. దీంతో విండీస్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. సిమన్స్ 50 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 77 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో విండీస్‌కు పరాజయం తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో పార్నెల్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు కలిస్, స్మిత్ శుభారంభం అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన స్మిత్ 18 బంతుల్లో 5ఫోర్లతో 31 పరుగులు చేశాడు. కలిస్ 31 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌తో 45 పరుగులు సాధించాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన గిబ్స్ 35 బంతుల్లో 8ఫోర్లు, సిక్స్‌తో 55 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7వికెట్లకు 183 పరుగులు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 7వికెట్లకు 183( గిబ్స్ 55, కలిస్ 45, స్మిత్ 31, టేలర్ 3/30)
వెస్టిండీస్: 20 ఓవర్లలో 9వికెట్లకు 163 (సిమన్స్ 77, బ్రేవో 19, పార్నెల్ 4/13, స్టెయిన్ 2/30).
News Posted: 13 June, 2009
|