ధోని దిష్టిబొమ్మ దగ్ధం
రాంచి : ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల చేతుల్లో వరుస ఓటమి అనంతరం భారత జట్టు ఇంటి ముఖం పట్టవలసిన రావడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఝార్ఖండ్ రాజధాని రాంచిలో సోమవారం క్రికెట్ అభిమానులు జట్టు కెప్టెన్, నగరానికి చెందిన మహేంద్ర సింగ్ ధోని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
సుమారు 50 మంది క్రికెట్ అభిమానులు సిద్దో కన్హు పార్క్ సమీపంలో గుమిగూడి ధోనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో ఎక్కువ మంది యువకులే. ఆ నిరసన ప్రదర్శకులు ధోని దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. 'ధోని టి20 ప్రపంచ కప్ తేలికగా తీసుకున్నాడు. క్రికెట్ పై కన్నా గ్లామర్ ప్రపంచంపైనే ధోనికి ఎక్కువ మోజు ఉన్నట్లున్నది' అని శ్యామకుమార్ అనే నిరసన ప్రదర్శకుడు వ్యాఖ్యానించాడు. ఈ టోర్నమెంట్ లో ఇండియా ఆడిన తీరుకు తాము 'దిగ్భ్రాంతి, నిరాశ' చెందామని మరొక ప్రదర్శకుడు రవి కుమార్ చెప్పాడు. 'సూపర్ 8కు అర్హత పొందలేకపోయిన ఆస్ట్రేలియా నుంచి ఇండియా గుణపాఠం నేర్చుకుని ఉండవలసింది' అని అతను అన్నాడు.
కాగా, రాంచి నగరంలో హర్ము రోడ్డులో నిర్మాణంలో ఉన్న ధోని ఇంటి వద్ద పోలీసు గస్తీని తీవ్రం చేశారు. 2007లో ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా ఓడిపోయినప్పటి వలె ఆగ్రహోదగ్రులైన అభిమానులు ధోని ఇంటిపై దాడి చేస్తారేమోననే భయాలు ఉన్నాయి. ఆ సమయంలో నిరసన ప్రదర్శకులు ధోని ఇంటి ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. కాని అదే సంవత్సరం ట్వంటీ20 టోర్నమెంట్ లో ఇండియా విజయం అనంతరం ఆ గోడను పునర్నిర్మించేందుకు క్రికెట్ అభిమానులు ముందుకు వచ్చారు.
News Posted: 15 June, 2009
|