'సెల్' గగ్గోలు
న్యూఢిల్లీ : మీరు ఈ వార్త చదువుతున్నప్పుడు మీ సెల్ ఫోన్ 'అంతర్జాతీయ మొబైల్ పరికరం గుర్తింపు' (ఐఎంఇఐ) నంబర్ లేనిదైతే అది పని చేస్తోందా అనేది నిర్థారించుకోవడం శ్రేయస్కరం. ఒక వేళ పని చేస్తుండకపోతే, దేశంలో ఈ నంబర్ లేని హ్యాండ్ సెట్లు గల 17 మిలియన్ల మందికి పైగా సెల్ ఫోన్ వినియోగదారులు మనకు తోడుగా ఉన్నారు కదా అని మీరు సంతృప్తి పడవచ్చు. ప్రతి హ్యాండ్ సెట్ కు ఈ నంబర్ ప్రత్యేకం.
ఈ నంబర్ లేని అన్ని హ్యాండ్ సెట్లను పని చేయించనివ్వవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో మొబైల్ ఆపరేటర్లు నవంబర్ 30 అర్ధరాత్రి గడువు పొడిగింపు కోసం చివరి క్షణంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉందని, ఈ నంబర్ లేని అన్ని హ్యాండ్ సెట్లను నవంబర్ 30 అర్ధరాత్రికల్లా డిస్కనెక్ట్ చేయవలసిందేనని టెలీ కమ్యూనికేషన్ల శాఖ (డిఒటి) అధికారి ఒకరు సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత మీడియాతో చెప్పారు.
ఐఎంఇఐ అనేది ప్రతి హ్యాండ్ సెట్ లో తయారీ సంస్థ నిక్షిప్తం చేసిన 15 అంకెల ప్రత్యేక (యునీక్) కోడ్. ఏదైనా కాల్ చేసినప్పుడు లేదా అందుకున్నప్పుడు ప్రతి సాధనాన్ని (ఫోన్ ను) ఇది గుర్తిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో విక్రయిస్తున్న చౌక చైనీస్ హ్యాండ్ సెట్లు చాలా వాటికి ఐఎంఇఐ నంబర్ లేదు. ఇంకా పెక్కు ఫోన్లకు నకిలీ నంబర్ ఉన్నది. ఇందులో 15 అంకెలూ 'సున్నా'యే.
భారత సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం (సిఒఎఐ) డైరెక్టర్ జనరల్ టి.ఆర్. దువా సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, 'మేము గడువు పొడిగింపును కోరాం. కాని మాకు డిఒటి నుంచి ఎటువంటి వర్తమానమూ లేదు. ఈ నంబర్ లేని హ్యాండ్ సెట్లు ఉన్న మా వినియోగదారులకు ఈ సౌకర్యం కలిగించేందుకు మాకు మరింత వ్యవధి అవసరం' అని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 1 December, 2009
|