కొత్త బ్యాంకులకు పోటీ
ముంబై : సమర్థ యాజమాన్యం గల బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్ బిఎఫ్ సి)లు పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. 11 సంవత్సరాల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) చివరిసారిగా ప్రైవేట్ రంగంలో రెండు సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్స్ లను జారీ చేసింది. అప్పటి నుంచి కొత్త బ్యాంకులకు అనుమతులు ఇవ్వలేదు. శుక్రవారం (ఫిబ్రవరి 26న) ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ లో చేసిన ప్రతిపాదన ఈ దిశలో తొలి చర్య.
మలి చర్యకు మంగళవారం పూనుకుంటున్నారు. దేశంలో ఎన్ బిఎఫ్ సిల వాణిజ్య విభాగమైన ఆర్థిక పరిశ్రమ అభివృద్ధి మండలి (ఎఫ్ఐడిసి) ఆధ్వర్యంలో అగ్ర శ్రేణి ఎన్ బిఎఫ్ సిల అధికారులు కొందరు పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చనున్న కొన్ని ఎన్ బిఎఫ్ సిల గురించి చర్చిండానికి ఆర్థిక మంత్రిత్వశాఖలో బ్యాంకింగి విభాగం కార్యదర్శి ఆర్. గోపాలన్ తో మంగళవారం సమావేశం అవుతున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. దాదాపు 12 నుంచి 15 వరకు ఎన్ బిఎఫ్ సిలు, ఆర్థిక రంగంలో అస్థిత్వం చాటుకున్న కార్పొరేట్ సంస్థలు బ్యాంకు ఏర్పాటుకు పోటీ పడవచ్చునని భావిస్తున్నారు.
'దేశంలో ఒక మాదిరి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ రేట్లతో ఆర్థిక సహాయం అందజేసే సంస్థల ఏర్పాటు అవసరం మెండుగా ఉందని ఆర్థిక మంత్రి విశ్వసిస్తున్నారు' అని పరిశ్రమ ప్రతినిధి ఒకరు చెప్పారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఇదే అంశాన్ని ప్రతిబింబిస్తున్నట్లు ఆర్థిక సేవల పరిశ్రమ భావిస్తున్నది. 'ఆర్థిక మంత్రిత్వశాఖలో పరిస్థితులు సరైన దిశలో సాగుతున్నాయి. బ్యాంకింగ్ కార్యదర్శి సమావేశం ఇదే విషయాన్ని నిరూపిస్తున్నది' అని ఒక ప్రతినిధి చెప్పారు. దీనిపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించినప్పుడు ఎఫ్ఐడిసి ఆఫీస్ బేరర్లు అందుబాటులో లేకపోయారు.
Pages: 1 -2- News Posted: 1 March, 2010
|