'సివిల్స్' పాసైన రేపిస్ట్!
న్యూఢిల్లీ: జైలు శిక్ష అనుభవిస్తూ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ఒక అత్యాచారం దోషికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం పాక్షికంగా ఉపశమనం కలిగించింది. ఉన్నతోద్యోగానికి అర్హత పొందడం ద్వారా అతను 'జైలులో ఆత్మశుద్ధి చేసుకున్నాడు' అని హైకోర్టు పేర్కొన్నది. ఈ కేసులో దోషి అశోక్ రాయ్ అలియాస్ అమిత్ ను నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేయడానికి హైకోర్టు న్యాయమూర్తులు ప్రదీప్ నంద్రజోగ్, అరుణా సురేష్ లతో కూడిన డివిజన్ బెంచ్ నిరాకరించింది. సుస్మిత (పేరు మార్చడమైనది) అనే యువతిపై అత్యాచార నేరానికి పాల్పడిన దోషిగా అతను కొనసాగుతాడని బెంచ్ స్పష్టం చేసింది. ఆమె 2003లో ఆత్మహత్య చేసుకుంది.
ఇప్పటికే ఐదున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినందున రాయ్ ఇప్పుడు జైలులో నుంచి విడుదల అవుతాడు. అతని ఈ జైలు శిక్ష వల్ల 'న్యాయం జరిగినట్లు'గా హైకోర్టు భావిస్తున్నది. ఐపిసి 306 సెక్షన్ (ఆత్మహత్యకు పురికొల్పడం) కింద రాయ్ దోషనిర్థారణను హైకోర్టు రద్దు చేయడంతో అతనికి ఈ పరిమిత ఉపశమనం లభించింది. అతను 'వివాహం చేసుకుంటానని తప్పుడు వాగ్దానం' చేసి (ఇది అత్యాచారంగా పరిగణనలోకి వస్తుంది) సెక్స్ కు ఆమె అంగీకారాన్ని పొందడం నేరమేనని, అయితే, ఆమెను ఆతను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని న్యాయమూర్తులిద్దరూ అభిప్రాయపడిన అనంతరం అతనికి ఈ విధమైన ఊరట లభించింది.
'21 సంవత్సరాల వయస్సులో సుస్మితకు తన చర్యల నైతిక విలువను అర్థం చేసుకోగల పరిణత ఉన్నది. రాయ్ తో పదే పదే సెక్స్ సంబంధం పెట్టుకోవడం వల్ల తాను గర్భవతిని కాగలనని ఆమెకు తెలుసు. అందుకే గర్భనిరోధక మాత్రలు వేసుకోవలసిందని ఆమెకు అతను సలహా ఇచ్చాడు' అని హైకోర్టు పేర్కొన్నది. 'సుస్మితకు కూడా ఈ నేరంలో కొంత వరకు భాగస్వామ్యం ఉంది' అని హైకోర్టు పేర్కొన్నది. అందువల్ల ఆమె ఆత్మహత్య పత్రంలో పేర్కొన్నట్లుగా ఆమె మరణానికి రాయ్ ను తప్పు పట్టరాదని కోర్టు స్పష్టం చేసింది.
Pages: 1 -2- News Posted: 11 February, 2009
|