వైఎస్ స్ర్కిప్ట్ ప్రణబ్ దేనా?
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శాసనసభలో ప్రకటన చేయడం వెనుక చాలా కథే నడించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరికి అభ్యంతరం లేనివిధంగా, అదే సమయంలో తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని అధిష్టానవర్గం నిర్ణయించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కు తెలియజేసింది. ఇటీవల వైఎస్, డిఎస్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అధిష్టానవర్గం ఆదేశం మేరకు కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జితో చర్చలు జరిపారు. ప్రత్యేక తెలంగాణపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా అధిష్టానం స్పష్టం చేసింది. ప్రణబ్ తో జరిపిన చర్చల సందర్భంగానే అసెంబ్లీలో ప్రకటన చేయాలన్న నిర్ణయం జరిగింది. అయితే ప్రకటన ఏవిధంగా ఉండాలన్న విషయంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుని అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో కలిసి ప్రణబ్ ఈ ప్రకటన రూపొందించారు.
గతంలో ప్రత్యేక తెలంగాణకు జైపాల్ సుముఖంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ అడ్డుకుంటున్నారన్న అభిప్రాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు అధిష్టానవర్గంలో కలిగించారు. దీంతో తెలంగాణపై ప్రకటనను రూపొందించే విషయంలో జైపాల్ రెడ్డికి కూడా అధిష్టానం ప్రమేయం కల్పించింది.ప్రణబ్, జైపాల్ ప్రకటనను రూపొందించిన తర్వాత ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుని అంగీకారాన్ని, సంతకాలను కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం చివరి క్షణం వరకు లీక్ కాకుండా చూడాలని కూడా అభయుల్నీ అధిష్టానం ఆదేశించింది. ఇలా ఉండగా, ఎన్నికలకు వెళ్ళబోయే ముందు తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను కొంతమేరకు సంతృప్తి పరచడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వైఎస్ అడ్డు అని తెలంగాణ వాదుల్లో నెలకొన్న అభిప్రాయాన్ని తొలగించడం, ప్రత్యేక తెలంగాణకు సానుకూలంగా ఉన్న పార్టీలతో కాకుండా సమైక్య వాదుల పార్టీలతో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకుందన్న ప్రచారం చేయడం ద్వారా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేయవచ్చన్నది ప్రకటన వెనుక ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
News Posted: 13 February, 2009
|