కూటమిలో తెలంగాణా లొల్లి
హైదరాబాద్ : కాంగ్రెస్ ను ఓడించే విషయంలో మహాకూటమిలో ఏకాభిప్రాయం వ్యవక్తమవుతుండగా, తెలంగాణ అంశంపై మాత్రం తలోదారిగా ఉంటున్నారు. నాలుగు పార్టీల 'మహా' నాయకులు ఒకే చోట చేరినప్పుడు తెలంగాణ అంశంపై వచ్చే ప్రశ్నలు వారికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. తెలంగాణ సాధన కోసం మహాకూటమి ఐక్యంగా పోరాడుతుందని సిపిఐ ప్రకటిస్తే పక్కనే కూర్చున్న సిపిఎం శాసనసభా నాయకులు నోముల నర్సింహయ్య దాన్ని ఖండిస్తున్నారు. మహాకూటమి పానకంలో తెలంగాణ అంశం పుడకలా అడ్డొస్తోందని టిడిపి నాయకులు అంటున్నారు. ఇక టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ పార్టీలోని ఇతర ప్రాంతాల నాయకులు తెలంగాణపై అతిగా మాట్లాడి మాకు ఇబ్బంది కలిగించవద్దని చంద్రబాబుకు చెబుతున్నారు. మహాకూటమి ఉమ్మడి అజెండాలో తెలంగాణ ఉంటుందని కెసిఆర్ ప్రకటించగా, సిపిఎం మాత్రం అలాంటిదేమీ ఉండదని ప్రకటించింది. ఇదే విషయాన్ని కెసిఆర్ ను ప్రశ్నిస్తే ఆ సంగతి తరువాత అంటూ దాటవేస్తున్నారు. మహాకూటమి ప్రథమ లక్ష్యం తెలంగాణ సాధన అని గతంలో టిడిపి ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి ప్రకటించారు. అయితే పార్టీలో గతంలో తెలంగాణ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యనమల రామకృష్ణుడు లాంటి నాయకులు, తెలంగాణ నాయకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎన్నికల తరువాత ఆ దిశగా పార్టీ ఎలాంటి కృషి చేయదని టిడిపిలో ఇతర ప్రాంతాల నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు తెలంగాణలో సైతం పార్టీ శ్రేణుల్లో ఇలాంటి అనుమానం ఉన్నప్పటికీ మా ఓట్లు మాకు వస్తే చాలు అని టిడిపి నాయకులు చెబుతున్నారు. తెలంగాణను అడ్డగిస్తున్నామనే పేరుతో తెలుగుదేశం అభిమానులు సైతం టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఏర్పడిందని, తాము తీసుకున్న అనుకూల నిర్ణయం వల్ల ఇప్పుడు టిడిపి సానుభూతి పరులైన టిడిపికే ఓటు వేసే అవకాశం ఉంది కదా! అని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. మహాకూటమి ప్రథమ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అని సిపిఐ నాయకులు, టిడిపిలో తెలంగాణ ప్రాంత నాయకులు చెబుతుంటే సిపిఎం నాయకులు మాత్రం కాంగ్రెస్ ను ఓడించడమే ప్రథమ లక్ష్యం అని చెబుతున్నారు. ఇక చంద్రబాబూ కాంగ్రెస్ ఓటమే ప్రథమ లక్ష్యం అని చెపుతున్నారు. అయితే మహా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణ అంశంపై మహాకూటమిలోని భిన్నాభిప్రాయాల వల్ల ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు తప్పేట్టుగా లేవని పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు.
News Posted: 14 February, 2009
|